3 నిమిషాల్లోపే 3 గోల్స్...

17 May, 2015 00:59 IST|Sakshi

లండన్ : ప్రతిష్టాత్మక ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) ఫుట్‌బాల్‌లో శనివారం సంచలనం నమోదైంది. సౌతాంప్టన్ క్లబ్‌కు చెందిన సాడియో మానె 3 నిమిషాల్లోపే 3 గోల్స్ కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆస్టన్ విల్లాతో జరిగిన ఈ మ్యాచ్‌లో సౌతాంప్టన్ 6-1 గోల్స్ తేడాతో గెలిచింది. అంతర్జాతీయ పోటీల్లో సెనెగల్ జట్టుకు ఆడే సాడియో మానె 2 నిమిషాల 56 సెకన్లలో (మ్యాచ్‌లో 13, 14, 15వ నిమిషాల్లో) మూడు గోల్స్ కొట్టి... 1992లో మొదలైన ఈపీఎల్‌లో అత్యంత వేగంగా ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.

1994లో రాబీ ఫౌలెర్ (4 నిమిషాల 33 సెకన్లు-లివర్‌పూల్) నెలకొల్పిన రికార్డును సాడియో మానె తిరగరాశాడు. అయితే ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత వేగవంతమైన ‘హ్యాట్రిక్’ రికార్డు టామీ రోస్ పేరిట ఉంది. 1964లో నైర్న్ కౌంటీ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోజ్ కౌంటీ తరఫన ఆడిన టామీ కేవలం 90 సెకన్లలో మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ చేశాడు.

మరిన్ని వార్తలు