83.. భారత క్రికెట్‌లో ఒక మరుపురాని జ్ఞాపకం

25 Jun, 2019 16:44 IST|Sakshi

న్యూఢిల్లీ : జూన్‌ 25, 1983.. భారత క్రికెట్‌ చరిత్రలో ఈ తేదీ ఒక సంచలనం. భారత క్రికెట్‌ అభిమానులకు ఒక మరుపురాని జ్ఞాపకం. సరిగ్గా ఇదే తేదీన 36 ఏళ్ల కిందట కపిల్‌ దేవ్‌ సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు  లార్డ్స్‌ మైదానంలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. అభేద్యమైన వెస్టిండీస్‌ జట్టును ఫైనల్‌లో మట్టికరిపించి.. ప్రపంచకప్‌ను ఒడిసిపట్టింది. మొట్టమొదటి విశ్వ క్రికెట్‌ కిరీటాన్ని స్వదేశానికి సగర్వంగా తీసుకొచ్చింది. 36 వసంతాల కిందటి ఈ అద్భుత విజయమే.. భారత క్రికెట్‌ను సమూలంగా మార్చివేసిందని చెప్పవచ్చు. ఈ ప్రపంచకప్‌ విజయం ప్రపంచ క్రికెట్‌లో భారతదేశ ఉనికిని బలంగా చాటింది. భారత క్రికెట్‌ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన ఘట్టమిది.

1983లో భారత జట్టుకు సరైన సదుపాయాలు కూడా లేవు. జట్టుకు కావాల్సిన అవసరాలను కూడా తీర్చలేని స్థితిలో నాటి భారత క్రికెట్‌ బోర్డు ఉండేది. ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన భారత జట్టుకు సన్మానం చేయడానికి కూడా నిధులు లేని పరిస్థితి. భారత జట్టు ఈ అపూర్వ విజయాన్ని సాధించిన తర్వాత క్రికెటర్లను సన్మానించడానికి.. ప్రఖ్యాత గాయకురాలు లతా మంగేష్కర్‌లో సంగీత కచేరీ నిర్వహించి విరాళాలు సేకరించారు. ఇక, 1983నాటి ప్రపంచకప్‌ పరిస్థితులను పరిశీలిస్తే.. అప్పటివరకు ఏ అంచనాలు లేని కపిల్‌ దేవ్‌ సారథ్యంలోని భారత జట్టు.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ వంటి బలమైన దేశాలను మట్టికరిపించింది. ప్రపంచకప్‌ సెమీ ఫైనల్స్‌ నుంచి ఫైనల్స్‌కు భారత జట్టును చేర్చడంలో కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ కీలక పాత్ర పోషించారు. లీగ్‌మ్యాచ్‌లో​ జింబాబ్వేపై కపిల్‌ వీరోచితమైన ప్రదర్శనతో 175 పరుగులు చేసి భారత జట్టును ఫైనల్‌కు చేర్చాడు. 

ప్రపంచకప్‌ ఫైనల్‌ రోజు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల టీవీలు, రేడియోల ముందు భారత అభిమానులు మ్యాచ్‌ను తిలకించారు. భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకొని 183 పరుగులు చేసింది. భారత జట్టుకు ఉన్న మదన్‌ లాల్‌ , మోహిందర్‌ అమర్‌నాథ్‌ వంటి బౌలర్లు అద్భుతమైన బౌలింగ్‌ పటిమతో వెస్టిండీస్‌ను 140 పరుగులకు ఆలౌట్‌ చేసి ప్రపంచకప్‌ను భారతదేశం ఒడిలోకి చేర్చి క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోయారు. ఆ మధుర క్షణాలు ఇప్పటికీ క్రికెట్‌ అభిమానుల మనస్సుల్లో భద్రంగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు