'మూడు'లో ముగించాలని!

24 Sep, 2017 00:56 IST|Sakshi

సిరీస్‌ విజయంపై భారత్‌ దృష్టి

నేడు ఆసీస్‌తో మూడో వన్డే

గెలిస్తేనే నిలిచే స్థితిలో స్మిత్‌ సేన

బరిలోకి ఆరోన్‌ ఫించ్‌!

సిరీస్‌ ప్రారంభానికి ముందు ప్రపంచ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో భారత్‌కు గట్టి పోటీయే ఎదురవుతుందని అంతా భావించారు. కానీ తాము ఎంతటి భీకర ఫామ్‌లో ఉన్నామో టీమిండియా గత రెండు మ్యాచ్‌ల్లోనూ చూపించింది. అటు బ్యాటింగ్‌.. ఇటు బౌలింగ్‌తో పటిష్ట ప్రత్యర్థిని దిమ్మ తిరిగేలా చేస్తూ దెబ్బతీశారు. స్వల్ప లక్ష్యాన్ని కూడా ప్రత్యర్థి ఛేదించకుండా భారత బౌలర్లు కట్టడి చేస్తున్న తీరు అమోఘం. ఇదే ఊపుతో సిరీస్‌లో కీలక మ్యాచ్‌ అయిన మూడో వన్డేలోనూ గెలిచి మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని కోహ్లి సేన భావిస్తోంది. మూడో వన్డేలోనే సిరీస్‌ ఖాయమైతే మిగిలిన వన్డేల్లో ప్రయోగాలకు వెళ్లాలని టీమిండియా ఆలోచిస్తోంది.

ఇక విదేశాల్లో వరుసగా పది మ్యాచ్‌లు ఓడిన నిరాశలో ఉన్న స్మిత్‌ సేన ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా నెగ్గితేనే సిరీస్‌పై ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ దశలో ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ గాయం నుంచి కోలుకోవడం వారికి ఊరటనిచ్చే విషయం. ఇండోర్‌లాంటి చిన్న మైదానంలోనైనా తమ బ్యాట్స్‌మెన్‌ నుంచి పరుగులు రావాలని ఆ జట్టు కోరుకుంటోంది.  

ఇండోర్‌: అంతులేని ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత క్రికెట్‌ జట్టు మరో సిరీస్‌పై కన్నేసింది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లను ఏకపక్షంగా ముగించిన ఉత్సాహంతో ఉన్న కోహ్లి బృందం నేడు కీలకమైన మూడో మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. గెలిస్తే సిరీస్‌ దక్కుతుంది కాబట్టి ఎలాంటి నిర్లక్ష్యానికి తావీయకూడదనే భావనలో ఉంది. ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌ల్లో భారత్‌కు విజయాలు అందించింది బౌలర్లే అని చెప్పవచ్చు. పేస్‌ బౌలర్లతో పాటు స్పిన్నర్లు కూడా ముప్పేట దాడి చేస్తుండటంతో ఆసీస్‌ ఊపిరి పీల్చుకోలేకపోతోంది. తొలి మ్యాచ్‌లో 164 (21 ఓవర్లలో), కోల్‌కతా పిచ్‌పై 252 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఆస్ట్రేలియాను ఛేదించకుండా భారత బౌలర్లు కంగారెత్తించారు. భారత బౌలర్ల ధాటికి ఎలా పరుగులు చేయాలో ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌కు అర్థం కావడం లేదు. తొలి వన్డేలో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్‌ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఇక కోల్‌కతా వన్డేలో నలుగురు మాత్రమే పదేసి పరుగులు దాటగలిగారు. దీంతో అన్ని విభాగాల్లో విఫలమవుతున్న ఆసీస్‌కు ఈ మ్యాచ్‌ అతి కీలకంగా మారింది. చేజారితే సిరీసే పోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ నెగ్గి తీరాలనే కసితో ఉంది.  

నంబర్‌ ఫోర్‌ ఎవరు?
రెండు మ్యాచ్‌ల్లోనూ బౌలర్ల నుంచి వంద శాతం అద్భుత ప్రదర్శన వచ్చినా భారత మిడిలార్డర్‌లో కాస్త నిలకడలేమి కనిపిస్తోంది. చెన్నై వన్డేలో ఈ విభాగం అనూహ్యంగా కుప్పకూలింది. పాండ్యా, ధోనిల నుంచి సూపర్‌ బ్యాటింగ్‌ రావడంతో గట్టెక్కింది. నాలుగో నంబర్‌లో బరిలోకి దిగుతున్న మనీష్‌ పాండే, కేదార్‌ జాదవ్‌ల నుంచి రెండు మ్యాచ్‌ల్లోనూ ఆశించిన ఆటతీరు రాలేదు. 2019 వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని నాలుగు, ఐదో స్థానాలను పటిష్టపర్చాలనే ఆలోచనలో టీమ్‌ మేనేజిమెంట్‌ ఉంది. రెండు మ్యాచ్‌ల్లోనూ రాణించని పాండేను తొలగించి కేఎల్‌ రాహుల్‌కు అవకాశమిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్లుగా రోహిత్, రహానే ఫర్వాలేదనిపిస్తుండగా కోహ్లి, ధోని ఫామ్‌ కొనసాగుతోంది. హార్దిక్‌ పాండ్యా కీలక సమయాల్లో అటు బ్యాట్‌తోనూ... ఇటు బంతితోనూ రాణించి అసలైన ఆల్‌రౌండర్‌గా నిలుస్తున్నాడు. ఇక చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్, యజువేంద్ర చహల్‌ను ఎలా ఎదుర్కోవాలో ఆసీస్‌కు అర్థం కావడం లేదు. భారత్‌ నుంచి వన్డేల్లో హ్యాట్రిక్‌ తీసిన తొలి స్పిన్నర్‌గా నిలిచిన కుల్దీప్‌ ఈ మ్యాచ్‌లోనూ కీలకమే. భువనేశ్వర్, బుమ్రా ఆరంభంలో... చివర్లో తమ బౌలింగ్‌తో ఇబ్బంది పెడుతున్నారు.

భారత్‌ను ఎదుర్కోవడమెలా?
ఇప్పుడు ఇదే ఆసీస్‌ను వెంటాడుతున్న సమస్య. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నిలకడలేమి జట్టుపై ప్రభావం చూపిస్తోంది. వార్నర్, స్మిత్‌పైనే అధికంగా ఆధారపడడం కూడా దెబ్బతీస్తోంది. అయితే స్మిత్‌ ఫామ్‌లోనే ఉన్నా వార్నర్, మ్యాక్స్‌వెల్‌ల నుంచి మెరుపు ఇన్నింగ్స్‌ను జట్టు ఆశిస్తోంది. ఓపెనర్‌ ఫించ్‌ గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో 20 నిమిషాలసేపు ప్రాక్టీస్‌ చేయగలిగాడు. దీంతో అతను కూడా ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. ఇదే జరిగితే వారి బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టమవుతుంది. అలాగే హ్యాండ్స్‌కోంబ్‌ కూడా కీపింగ్‌ ప్రాక్టీస్‌ చేయడంతో వేడ్‌కు స్థానం కష్టమే. పేసర్లు కూల్టర్‌ నీల్, కమిన్స్‌ మెరుగ్గానే రాణిస్తున్నారు. అయితే ఇప్పటిదాకా రెండు వికెట్లు మాత్రమే తీసిన లెగ్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా ఆసీస్‌ను నిరాశ పరుస్తున్నాడు. అతడి స్థానంలో ఆఫ్‌ స్పిన్నర్‌ ఆస్టన్‌ ఏగర్‌ను ఆడించే అవకాశాలున్నాయి.  

► 4 భారత్‌ ఇక్కడ ఆడిన నాలుగు వన్డేల్లోనూ విజయం సాధించింది.

► 9 ఈ మ్యాచ్‌లోనూ భారత్‌ గెలిస్తే వరుసగా తొమ్మిది మ్యాచ్‌లను రెండోసారి గెలిచినట్టవుతుంది.  

►  41 మరో 41 పరుగులు చేస్తే అత్యంత వేగంగా (35ఇన్నింగ్స్‌) రెండు వేల పరుగులు పూర్తి చేసిన తొలి కెప్టెన్‌గా డివిలియర్స్‌ (దక్షిణాఫ్రికా)ను కోహ్లి అధిగమిస్తాడు.

జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, రహానే, పాండే/రాహుల్, జాదవ్, ధోని, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా.
ఆస్ట్రేలియా: స్మిత్‌ (కెప్టెన్‌), ఫించ్, వార్నర్, హెడ్, హ్యాండ్స్‌కోంబ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, కమిన్స్, కూల్టర్‌ నిల్, రిచర్డ్‌సన్, జంపా/ఏగర్‌.

పిచ్, వాతావరణం
తక్కువ దూరంలోనే బౌండరీ ఉండటంతోపాటు ఫ్లాట్‌ పిచ్‌ బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామం కానుంది. సిరీస్‌లో తొలిసారిగా 300 పరుగులకు పైగా పరుగులు వచ్చే అవకాశం ఉంది. వర్షం అంతరాయం కలిగించే పరిస్థితి లేదు.
 

మరిన్ని వార్తలు