45 నిమిషాలు.. 39 బంతులు

3 Jan, 2020 11:50 IST|Sakshi

దద్దరిల్లిన సిడ్నీ స్టేడియం

సిడ్నీ:  ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మన్‌లలో ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ ఒకడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న స్మిత్‌.. క్రీజ్‌లో పాతుకుపోయి సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటంలో సిద్ధహస్తుడు. టెస్టుల్లో స్మిత్‌ యావరేజ్‌, స్టైక్‌రేట్‌లు 55కు పైగా ఉండటం అతనిలోని బ్యాటింగ్‌ సత్తాకు నిదర్శనం. అయితే అటువంటి బ్యాట్స్‌మన్‌ తొలి పరుగు పూర్తి చేసుకోవడానికి 39 బంతులు ఆడాడు. 45 నిమిషాల తర్వాత పరుగు తీశాడంటే ప్రత్యర్థి బౌలర్లు ఏ తరహా బంతులు వేశారో అర్థం చేసుకోవచ్చు. 

న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరిదైన మూడో తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా సెకండ్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్‌.. ఆచితూచి ఆడాడు. న్యూజిలాండ్‌ బౌలర్ల నుంచి వచ్చే బంతులను ముందు సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి యత్నించిన స్మిత్‌.. సింగిల్‌ తీయడం కోసం ఎక్కువ సేపే నిరీక్షించాడు. ఇలా మొదటి పరుగును పూర్తి చేసుకోవడానికి తంటాలు పడ్డ స్మిత్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 39 బంతులకు మొదటి పరుగు తీసిన స్మిత్‌.. 143 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. స్మిత్‌ సింగిల్‌ తీసిన తర్వాత సిడ్నీ స్టేడియం దద్దరిల్లింది. స్టేడియంలోని అభిమానులు లేచి మరీ స్మిత్‌ను చప్పట్లతో అభినందించారు. ఒక బ్యాట్స్‌మన్‌ సెంచరీ చేసిన క్రమంలో అభిమానుల హర్ష ధ్వానాలనే సాధారణంగా చూస్తాం. మరి ఇక్కడ ఆసీస్‌ అభిమానులు మాత్రం పరుగు తీసిన తర్వాత అతన్ని చప్పట్లతో అభినందించడం విశేషం. అదే సమయంలో లబూషేన్‌తో కలిసి 100కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పాడు. ఇక్కడ లబూషేన్‌ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. తొలి రెండు టెస్టులను ఆసీస్‌ గెలిచి సిరీస్‌ను ముందుగానే గెలిచింది. ఇక క్లీన్‌స్వీప్‌పై దృష్టి పెట్టిన ఆసీస్‌ మరో విజయం కన్నేసింది. మరి కివీస్‌ మాత్రం ఆఖరి టెస్టులో గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా