బెయిల్స్‌ తీసేసి ఆడించారు..

5 Sep, 2019 03:18 IST|Sakshi

లబషేన్, స్మిత్‌ అర్ధసెంచరీలు

మాంచెస్టర్‌: యాషెస్‌ నాలుగో టెస్టుకు వరుణుడు అడ్డుగా నిలిచాడు. బుధవారం ఇక్కడ ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా–ఇంగ్లండ్‌ పరస్పరం పైచేయికి యత్నిస్తున్న సమయంలో పలుసార్లు అంతరాయం కలిగించాడు. దీంతో 44 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా... ఆసీస్‌ మూడు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్‌ (0), హారిస్‌ (13) వికెట్లను త్వరగానే కోల్పోయింది. బ్రాడ్‌ (2/35) ఇన్నింగ్స్‌ నాలుగో బంతికే వార్నర్‌ను ఔట్‌ చేశాడు. అయితే, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ లబషేన్‌ (128 బంతుల్లో 67; 10 ఫోర్లు); స్టీవ్‌ స్మిత్‌ (60 బ్యాటింగ్‌; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. ప్రస్తుతం స్మిత్‌కు తోడుగా హెడ్‌ (18 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు.  

బెయిల్స్‌ తీసేసి...
తొలి రోజు ఈ మ్యాచ్‌లో అరుదైన దృశ్యం కనిపించింది. తీవ్రంగా గాలి వీయడంతో పలుమార్లు బెయిల్స్‌ కింద పడ్డాయి. దాంతో అంపైర్లు ధర్మసేన, ఎరాస్మస్‌ ఇన్నింగ్స్‌ 32వ ఓవర్లో బెయిల్స్‌ను తొలగించి ఆటను కొనసాగించారు. ఇలా ఆడించడంపై ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్, బౌలర్‌ బ్రాడ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు