జట్టులో 10 మందికి కరోనా.. ఆందోళనలో పీసీబీ

23 Jun, 2020 19:56 IST|Sakshi

లాహోర్‌ : ఎప్పుడు వివాదాలతో సతమతమయ్యే పాక్‌ క్రికెట్‌ జట్టుకు కరోనా సెగ తగిలింది. జట్టులోని ఆటగాళ్లంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే జట్టులోని ముగ్గరు ఆటగాళ్లకు కరోనా సోకగా తాజాగా మరో ఏడుగురు పాక్‌ క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. సోమవారం పాక్‌ యువ ఆటగాడు హైదర్‌ అలీతో పాటు షాదాబ్‌ ఖాన్, హారిస్‌ రవూఫ్‌లు కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. తాజాగా ఫఖర్ జమాన్, ఇమ్రాన్ ఖాన్, కాశీఫ్ భట్టి, మహ్మద్ హఫీజ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్, వహాబ్ రియాజ్‌లు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కరోనా సంక్షోభంతో భారీ విరామం తర్వాత మరో వారం రోజుల్లో ఇంగ్లండ్ పర్యటన కోసం బయలుదేరాల్సిన పాక్‌ క్రికెట్‌ జట్టుకు పెద్దదెబ్బే తగిలింది. ఈ సిరీస్‌ కోసం ఎంపికైన 29 మంది పాక్‌ క్రికెటర్లకు కోవిడ్‌-19 టెస్టులు నిర్వహించారు.(టెన్నిస్‌ స్టార్‌ జొకోవిచ్‌కు కరోనా పాజిటివ్‌)

కాగా పాక్‌ సీనియర్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్తో పాటు పాక్‌ జట్టు ప్రధాన కోచ్‌ వకార్ యూనిస్, ఫిజియోథెరపిస్ట్‌ క్లిఫ్‌ డెకాన్‌ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. దీంతో పీసీబీలో ఆందోళన నెలకొంది. ఇంగ్లండ్‌ పర్యటన కోసమే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆదివారం నుంచి రావల్పిండిలో కరోనా పరీక్షలు నిర్వహించడంతో ఒక్కొక్కరిగా 10 మందికి కరోనా సోకడంతో క్రికెటర్లంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. వీరిని పీసీబీ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.('కోచ్‌ పదవి నాకు సవాల్‌గా కనిపిస్తుంది')

మరిన్ని వార్తలు