ఫుట్సల్‌ ప్రపంచ కప్‌కు మనోళ్లు

26 Oct, 2019 09:56 IST|Sakshi

భారత జట్టుకు ఎంపికైన ఎనిమిది మంది రాష్ట్ర క్రీడాకారులు

బార్సిలోనా వేదికగా మెగా ఈవెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: ఫుట్‌బాల్‌ క్రీడలో భవిష్యత్‌ స్టార్లుగా ఎదిగేందుకు తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఏఎంఎఫ్‌ సి–13 ఫుట్సల్‌ (ఇండోర్‌ ఫుట్‌బాల్‌) ప్రపంచకప్‌లో తమదైన ముద్ర వేసేందుకు తెలంగాణకు చెందిన ఎనిమిది మంది చిన్నారులు సన్నద్ధమయ్యారు. బార్సిలోనా వేదికగా ఈనెల 28 నుంచి నవంబర్‌ 3 వరకు జరుగనున్న ఫుట్సల్‌ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. కొంపల్లిలోని డెకథ్లాన్‌ ఫుట్సల్‌ కోర్టులో ఏర్పాటు చేసిన అండర్‌–13 జాతీయ స్థాయి శిక్షణా శిబిరంలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన 11 మంది క్రీడాకారులను శుక్రవారం భారత జట్టుకు ఎంపిక చేశారు.

ఇందులో తెలంగాణకు చెందిన 8 మంది చోటు దక్కించుకోగా... ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన ఒక్కో ప్లేయర్‌కు స్థానం దక్కింది. ఈ జట్టుకు కెపె్టన్‌గా కెవిన్‌ మార్క్, కోచ్‌గా నికోలస్‌ ఫెర్నాండేజ్‌ వ్యవహరిస్తారు. తెలంగాణ ఫుట్సల్‌ అసోసియేషన్, స్కైకింగ్స్‌ ఎఫ్‌సీ జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తోన్న నికోలస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ ఫుట్సల్‌ జట్టు గత కొంత కాలంగా నిలకడగా విజయాలు నమోదు చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొచ్చి వేదికగా జరిగిన జాతీయ ఫుట్సల్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తెలంగాణ జట్టు... ఆగస్టులో గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన నేషనల్‌ చాంపియన్‌షిప్‌లో మూడో స్థానాన్ని దక్కించుకుంది.

జట్టు వివరాలు: ప్రథమ్‌ జోషి, ధన్వీ తేజస్, ఆకాశ్‌ ప్రధాన్, శ్లోక్‌ అశోధ, హర్ష ప్రకాశ్‌ సింగ్, కెవిన్‌ మార్క్, జాసన్‌ పావెల్, ఆర్యన్‌ (తెలంగాణ), కార్తీక్‌ (ఆంధ్రప్రదేశ్‌), శివమ్‌ (మహారాష్ట్ర), లక్ష్య (ఉత్తర్‌ప్రదేశ్‌).   

మరిన్ని వార్తలు