4 లో ఎవరు?

26 Sep, 2017 10:22 IST|Sakshi

కీలక స్థానంతో భారత్‌ ప్రయోగాలు

మళ్లీ మళ్లీ మార్పులతో సమస్యలు

రెండున్నరేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో వన్డే వరల్డ్‌ కప్‌ జరిగిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు భారత జట్టు తరఫున నాలుగో స్థానంలో మొత్తం 11 మంది వేర్వేరు ఆటగాళ్లు బరిలోకి దిగారు. ఈ మధ్య కాలంలో 16 జట్లు వన్డేలు ఆడగా... ఇతర జట్లతో పోలిస్తే అందరికంటే ఎక్కువ మందిని ఆ స్థానంలో పరీక్షించింది టీమిండియానే.

కీలకమైన ‘టూ డౌన్‌’ స్థానంలో ఏ మ్యాచ్‌లో ఎవరు దిగుతారో చెప్పలేని పరిస్థితి టీమిండియాలో ఉంది. వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లలో విజయాలతో పాటు చాంపియన్స్‌ ట్రోఫీలో ఫైనల్‌ కూడా చేరడంతో ఇప్పటి వరకు ఈ లోపం పెద్దగా బయటపడకపోయినా, మున్ముందు దీనికి పరిష్కారం చూడాల్సిన బాధ్యత కోహ్లి సేనపై ఉంది.   

సాక్షి క్రీడా విభాగం: వన్డేలకు సంబంధించి నాలుగో స్థానం ఎంతో కీలకం. గుడ్డిగా బ్యాట్‌ ఊపినట్లు కాకుండా పరిస్థితులను బట్టి ఆడటం ముఖ్యం. జట్టు ఇన్నింగ్స్‌ బాగా సాగుతుంటే అందులో జోరు తగ్గిపోకుండా కొనసాగించడమే కాదు... టీమ్‌ కష్టాల్లో ఉంటే ఇన్నింగ్స్‌ను నిలబెట్టాల్సిన బాధ్యత కూడా ఆ ఆటగాడిపై ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే అటు పేస్, ఇటు స్పిన్‌ను కూడా సమర్థంగా ఆడగల నైపుణ్యం  నాలుగో నంబర్‌ ఆటగాడికి అవసరం. పూర్తి స్థాయిలో ఓపెనర్‌గా మారిన తర్వాత కూడా జట్టు అవసరాల దృష్ట్యా సచిన్‌ స్థాయి ఆటగాడు కూడా 38 వన్డేల్లో నాలుగో స్థానంలో ఆడాడంటే ఆ స్థాయి ప్రాధాన్యత ఏమిటో తెలుస్తుంది. అయితే ఇటీవల భారత జట్టులో బ్యాటింగ్‌ ఆర్డర్‌ను చూస్తే తాను నాలుగో స్థానంలో ఆడాల్సి ఉంటుందని ఏ ఆటగాడు కచ్చితంగా ఊహించలేకపోతున్నాడు. ముఖ్యంగా ఈ స్థానం కోసం ప్రయత్నిస్తున్న బ్యాట్స్‌మెన్‌కు నిలదొక్కుకునేందుకు తగిన సమయమే ఇవ్వడం లేదు. వన్డేల్లో మన ముగ్గురు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ ధావన్, రోహిత్, కోహ్లి టాపార్డర్‌లో 1, 2, 3 స్థానాల్లో ఆడతారని తడుముకోకుండా చెప్పే అవకాశం ఉండగా... నాలుగో స్థానం మాత్రం ఎవరికీ కాకుండా పోతోంది.  

మనీశ్‌ పాండే ఫెయిల్‌!
నాలుగో స్థానంలో ఆడించి ప్రయత్నం చేసిన 11 మందిలో ముగ్గురిపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అనుభవం పరంగా కెరీర్‌ ఆరంభంలోనే ఉన్నా... వీరిలో సరైన వ్యక్తిని ఎంచుకునే అవకాశం కనిపించింది. కేదార్‌ జాదవ్, మనీశ్‌ పాండే, లోకేశ్‌ రాహుల్‌లకు ఇటీవల వరుసగా అవకాశాలు లభించాయి. వీరికి లభించిన పరిమిత అవకాశాల్లోనే వారిని తీసి పడేయాల్సిన అవసరం లేదు కానీ అవకాశం లభించిన సమయంలో మాత్రం వారి నుంచి ఆశించిన ఆట కనిపించలేదు. కోల్‌కతా వన్డేలో 121/2తో దాదాపు సగం ఓవర్లు మిగిలి ఉన్న మెరుగైన స్థితిలో పాండే క్రీజ్‌లోకి వచ్చాడు. అప్పటికే ఆసీస్‌ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ స్థితిలో భారీ స్కోరు చేసేందుకు పాండేకు మంచి అవకాశం లభించినా... అతను పేలవమైన రీతిలో అవుటై చివరి వరుస బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచాడు. నిజానికి ఇప్పుడు జట్టుకు దూరమైనా... యువరాజ్‌ తన ఆఖరి 9 ఇన్నింగ్స్‌లలో నాలుగో స్థానంలో 358 పరుగులు చేసి ఆ స్థానంలో తన విలువను చూపించాడు. పాండే 7 ఇన్నింగ్స్‌లలో కలిపి 183 పరుగులే చేయగా... జాదవ్, రాహుల్‌ ఆకట్టుకోలేదు.  

ఎవరు నిలబడతారు?
2015 ప్రపంచ కప్‌ తర్వాతి నుంచి ఆడిన 11 మందిలో రహానే పరిస్థితి భిన్నంగా ఉంది. సత్తా ఉన్నా అతడిని నాలుగో స్థానంలో ఆడించకుండా కేవలం బ్యాకప్‌ ఓపెనర్‌గా, ఎవరైనా గాయపడితేనే అవకాశం ఇస్తున్నారు. రాయుడు, దినేశ్‌ కార్తీక్, మనోజ్‌ తివారి ఆట దాదాపుగా ముగిసి పోయింది. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ధోని  పూర్తి స్థాయిలో నాలుగో నంబర్‌ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగుతాడని వినిపించింది కానీ కోహ్లి దానిని సీరియస్‌గా పట్టించుకున్నట్లు లేదు. శ్రీలంకలో పాండేకు ముందు రాహుల్‌కు నాలుగో స్థానంలో అవకాశం ఇస్తే అతను విఫలమయ్యాడు. ఆసీస్‌తో తొలి రెండు వన్డేల్లో పాండే ఫెయిలవ్వగా... ఇండోర్‌లో అనూహ్యంగా హార్దిక్‌ పాండ్యాకు అవకాశం లభించింది. ఆదివారం మ్యాచ్‌కు ముందు ఈ స్థానంలో పాండ్యా రెండు సార్లు విఫలమైన విషయం మరచిపోవద్దు. మనీశ్‌ పాండే తన కెరీర్‌లో ఎక్కువ భాగం మిడిలార్డర్‌లోనే ఆడగా, రాహుల్‌ కెరీర్‌ మొత్తం ఓపెనర్‌గానే సాగింది. 32 వన్డేలు ఆడినా ఇంకా జాదవ్‌ను నమ్మలేని పరిస్థితి ఉంది. లంకతో ఒక మ్యాచ్‌లో నంబర్‌ 4 అవకాశం ఇస్తే అతను దానిని ఉపయోగించుకోలేదు. 2019 ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఇది ఇప్పటికిప్పుడు కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన సమస్య అయితే కాదు కానీ... పూర్తిగా ఉపేక్షించాల్సిన చిన్న విషయం కూడా కాదు. కాబట్టి అందుబాటులో ఉన్నవారిలో ఒకరికి వరుసగా ఎక్కువ మ్యాచ్‌లలో అవకాశం కల్పిస్తే భారత్‌కు అవసరమైన నంబర్‌ 4 ఆటగాడు లభించేస్తాడు.

మరిన్ని వార్తలు