భారత్... ‘సెంచరీ’ దాటింది

27 Jun, 2016 00:56 IST|Sakshi
భారత్... ‘సెంచరీ’ దాటింది

రియో ఒలింపిక్స్‌కు భారీ బృందం
మరో నలుగురు అథ్లెట్స్‌కు ‘బెర్త్’
►  ఇప్పటివరకు 103 మంది అర్హత

 
న్యూఢిల్లీ: పతకాలు ఎన్ని వస్తాయో కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నా... ఈసారి మాత్రం భారత్ నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒలింపిక్స్ క్రీడలకు భారీ బృందం బరిలోకి దిగనుంది. మరో 39 రోజుల్లో ప్రారంభంకానున్న ఈ విశ్వ క్రీడా సంరంభానికి ఇప్పటివరకు భారత్ నుంచి 103 మంది క్రీడాకారులు అర్హత సాధించారు. ఒకే ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ నుంచి వందకుపైగా క్రీడాకారులు పాల్గొనడం ఇదే ప్రథమం. 2012 లండన్ ఒలింపిక్స్‌లో అత్యధికంగా భారత్ నుంచి 83 మంది క్రీడాకారులు పాల్గొనగా... రెండు రజతాలు (సుశీల్ కుమార్, విజయ్ కుమార్), నాలుగు కాంస్య పతకాలు (సైనా నెహ్వాల్, మేరీకోమ్, గగన్ నారంగ్, యోగేశ్వర్ దత్) లభించాయి.


 అనస్, అంకిత్ జాతీయ రికార్డులు
 ఆదివారం భారత్ నుంచి నలుగురు క్రీడాకారులు ‘రియో’ బెర్త్‌ను ఖాయం చేసుకున్నారు. పోలాండ్‌లో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్‌లో 21 ఏళ్ల మొహమ్మద్ అనస్ పురుషుల 400 మీటర్ల విభాగంలో 45.40 సెకన్లలో గమ్యానికి చేరుకొని ‘రియో’ అర్హత ప్రమాణాన్ని అందుకున్నాడు. అదే క్రమంలో కేరళకు చెందిన అనస్ 45.44 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును తిరగరాశాడు. పురుషుల లాంగ్‌జంప్‌లో హరియాణాకు చెందిన అంకిత్ సింగ్ కజకిస్తాన్‌లో జరిగిన అంతర్జాతీయ మీట్‌లో 8.19 మీటర్ల దూరం దూకి ‘రియో’ బెర్త్‌ను దక్కించుకున్నాడు. లాంగ్‌జంప్‌లో రియో అర్హత ప్రమాణం 8.15 మీటర్లుగా ఉంది. 23 ఏళ్ల అంకిత్ ధాటికి 2013లో ప్రేమ్‌కుమార్ 8.09 మీటర్లతో నెలకొల్పిన జాతీయ రికార్డు బద్దలైంది.

అంకిత్ ఇటీవల దక్షిణాసియా క్రీడ ల్లో, జాతీయ క్రీడల్లో స్వర్ణాలు సాధించాడు. మరోవైపు కజకిస్తాన్‌లోనే జరిగిన మీట్‌లో ఒడిషాకు చెంది న 24 ఏళ్ల శ్రాబణి నందా 200 మీటర్ల మహిళల విభాగంలో ‘రియో’ బెర్త్‌ను దక్కించుకుంది. ఆమె 200 మీటర్ల రేసును 23.07 సెకన్లలో పూర్తి చేసి ‘రియో’ అర్హత ప్రమాణాన్ని(23.20 సెకన్లు) అధిగమించింది.


ఆర్చర్ అతాను దాస్ ఎంపిక
మరోవైపు పురుషుల ఆర్చరీలో భారత్‌కు లభించిన ఏకైక స్థానాన్ని కోల్‌కతాకు చెందిన 24 ఏళ్ల అతాను దాస్ దక్కించుకున్నాడు. బెంగళూరులో ఆదివారం నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో అతాను దాస్ తనకంటే అనుభవజ్ఞులైన జయంత తాలుక్‌దార్, మంగళ్‌సింగ్ చాంపియాలను ఓడించాడు. గతేడాది డెన్మార్క్‌లో జరిగిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మంగళ్ సింగ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకొని భారత్‌కు ఏకైక ‘కోటా’ను అందించాడు. అయితే భారత ఆర్చరీ సంఘం మంగళ్ సింగ్‌కు ఎంట్రీ ఖాయం చేయకుం డా... సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించి ఫామ్‌లో ఉన్న అతాను దాస్‌కు ‘రియో’ బెర్త్ ఖాయం చేసింది.
 

మరిన్ని వార్తలు