నెపోటిజమ్‌ అనే మాటే లేదు: ఆకాశ్‌ చోప్రా

27 Jun, 2020 16:19 IST|Sakshi

ముంబై: సినీ పరిశ్రమలో ప్రస్తుతం నెపోటిజం అంటూ తీవ్రస్థాయిలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నెపోటిజం సెగ భారత క్రికెట్‌ను కూడా తాకింది. బంధుప్రీతి కారణంగా నైపుణ్యం ఉన్న ఆటగాళ్లకు అన్యాయం జరుగుతుందనే వాదన సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా నడుస్తోంది. ముఖ్యంగా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వారసుడు అర్జున్‌ టెండూల్కర్‌ను టార్గెట్‌ చేస్తూ భారత క్రికెట్‌లో నెపోటిజం ఉందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సచిన్‌ కుమారుడనే ఒకే ఒక కారణంతో అతడిని ఎంపిక చేస్తున్నారని ఆరోపిస్తూనే ప్రతిభ ఉన్నా జట్టులోకి తీసుకోని పలువురు ఆటగాళ్ల పేర్లను తెరపైకి తీసుకొస్తున్నారు. (‘టై’ అయితే సంయుక్త విజేతగా ప్రకటించండి)

అయితే భారత క్రికెట్‌లో నెపోటిజమ్‌ అనే ప్రస్తావనే లేదని టీమిండియా మాజీ టెస్టు ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా స్పష్టం చేశాడు.  ‘అర్జున్‌ టెండూల్కర్‌ పేరును తెరపైకి తీసుకొచ్చి విమర్శించడం సరికాదు. సచిన్‌ కుమారుడైనంత మాత్రాన అతడికి టీమిండియాలో అవకాశాన్ని పువ్వుల్లో పెట్టివ్వరు. అన్ని విధాలుగా అర్హుడైతేనే జట్టులోకి వస్తాడు. ఇక అండర్‌-19 సెలక్షన్స్‌లో కూడా ఎలాంటి అవకతవకలు జరగవు. ప్రతిభ, బీసీసీఐ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉంటేనే అండర్‌-19 జట్టులోకి తీసుకుంటారు. (‘రైజర్స్‌’తోనే నేర్చుకున్నా...)

సునీల్‌ గావస్కర్‌ తనయుడు రోహన్‌ గావస్కర్‌ కూడా బెంగాల్‌ రంజీ టీంలో మెరుగైన ప్రదర్శన చేశాడు కాబట్టే భారత జట్టులోకి వచ్చాడు. గావస్కర్‌ ఇంటి పేరు ఉన్నప్పటికీ రోహన్‌కు ముంబై రంజీ టీంలో చోటు దక్కని విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా టీమిండియా తరుపున అనేక మ్యాచ్‌లు ఆడి విజయాలను అందించినప్పటికీ తన కొడుకుకు కనీసం ముంబై టీంలో అవకాశం సునీల్‌ గావస్కర్‌ అవకాశం ఇప్పించలేదు. ఎందుకుంటే ప్రతిభ ఉంటే అవకాశం వస్తుంది. బంధుప్రీతితో కాదు’ అంటూ అకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.  (‘నల్లవారిని’ నిరోధించేందుకే...)

మరిన్ని వార్తలు