'అలా అనుకుంటే కోహ్లి స్థానంలో రోహిత్‌ ఉంటాడు'

30 Jun, 2020 13:31 IST|Sakshi

న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్సీలో మార్పు చేయాలని బీసీసీఐ భావిస్తే ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి రోహిత్‌ శర్మ రెడిమేడ్‌గా ఉన్నాడని మాజీ టెస్టు క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. ఒకవేళ రానున్న కాలంలో జరగనున్న ఐసీసీ ఈవెంట్స్‌లో భారత్‌  టైటిల్‌ నెగ్గడంలో విఫలమైతే నాయకత్వ మార్పులో కొత్త దిశగా వెళితే మాత్రం రోహిత్‌శర్మను ఆప్షన్‌గా చూడవచ్చని చోప్రా తెలిపాడు. స్పోర్ట్స్‌ వ్యాఖ్యాత సవేరా పాషాతో జరిగిన యూట్యూబ్‌ ఇంటరాక్షన్‌లో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ప్రస్తుతానికైతే టీమిండియా ఆటతీరు బాగానే ఉంది. ఒకవేళ రానున్న ఆరు నెలలు లేక ఏడాదిన్నర కాలంలో ఆటతీరులో ఏవైనా లోపాలు కనిపిస్తే కొత్త కెప్టెన్‌ను చూసే అవకాశం ఉంటుంది. ఒక బ్యాట్స్‌మన్‌గా కోహ్లిని తప్పుబట్టలేము. ఒక్కడిగా చూస్తే కోహ్లి ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా ఉంటాడు. ఒక బ్యాట్స్‌మన్‌గా ఎప్పుడో ఉన్నత శిఖరానికి చేరుకున్నాడు. కానీ జట్టుగా చూస్తే మాత్రం కోహ్లి కెప్టెన్‌గా ఇంకా నేర్చుకుంటున్నాడు. ఒకవేళ రానున్న కాలంలో నాయకత్వ మార్పును కోరుకుంటే రోహిత్‌ శర్మ రెడీమేడ్‌ కెప్టెన్‌గా రెడీగా ఉన్నాడు. వచ్చే 10 నుంచి 12 నెలల కాలం పాటు కోహ్లీనే కెప్టెన్‌గా ఉంటాడు.. ఒకవేళ రానున్న ఐసీసీ ఈవెంట్స్‌లో భారత్‌ టైటిల్‌ నెగ్గకపోతే మాత్రం నాయకత్వ మార్పు ఉంటుంది. రానున్న చాంపియన్స్‌ ట్రోపీని ఇండియా గెలుస్తుందనే ఆశిస్తున్నా. ఎందుకంటే 2013 తర్వాత టీమిండియా చాంపియయన్స్‌ ట్రోపీ గెలవలేదు. అంతేగాక 2021లో టీ20 ప్రపంచకప్‌ భారత్‌లో జరగనుంది. ఒకవేళ ఈ రెండింటిలో ఏ ఒక్కటి గెలవలేకపోయినా జట్టు మేనేజ్‌మెంట్‌ నాయకత్వ మార్పు గురించి ఆలోచన చేయాల్సిందే. ' అంటూ ఆకాశ్‌ చోప్రా తెలిపాడు.('నాకు ఆరు నెలల ముందే కరోనా వచ్చింది')

2014లో ఎంఎస్‌ ధోనీ నుంచి టెస్టు క్రికెట్‌ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న కోహ్లి జట్టును బాగానే నడిపించాడు. అనతికాలంలోనే టెస్టుల్లో జట్టును నెంబర్‌వన్‌ స్థానంలో నిలిపాడు. అంతేగాక టెస్టుల్లో వరల్డ్‌ క్లాస్‌ పేసర్లతో టెస్టు క్రికెట్‌లో భారత్‌ను అత్యున్నత స్థానానికి తీసుకెళ్లాడు. ఇక 2017లో వన్డే కెప్టెన్సీగా బాధ్యతలు తీసుకున్న కోహ్లి సమర్థంగానే నడిపించినా మేజర్‌ ఐసీసీ ఈవెంట్స్‌ టైటిళ్లను మాత్రం తేలేకపోయాడు. వాటిలో 2017లో జరిగిన చాంపియన్స్‌ ట్రోపీలో ఫైనల్‌కు చేరుకున్న భారత్‌ అక్కడ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ చేతిలో ఓడిపోయింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో లీగ్‌లో అప్రతిహాత విజయాలతో దూసుకెళ్లిన కోహ్లి సేన సెమీస్‌లో మాత్రం న్యూజిలాండ్‌ చేతిలో భంగపడింది.

అయితే ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు నాసిర్‌ హుస్సెన్‌ మాత్రం కోహ్లి లాంటి ఆటగాడిని కెప్టెన్సీ పదవి నుంచి తీసే అవకాశం ఇప్పట్లో లేదని పేర్కొన్నాడు. అతను ఆటగాడిగానే గాక కెప్టెన్‌గానూ విజయవంతం అయ్యాడని నాసిర్‌ తెలిపాడు. మరోవైపు కోహ్లి కెప్టెన్సీ పదవి నుంచి తొలగిస్తే అతను ఒత్తిడికి లోనవ్వకుండా తన ఆట తాను ఆడుకుంటాడని భారత మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ అతు్ల్‌‌ వాసన్‌ తెలిపాడు. అయితే అతుల్‌ వ్యాఖ్యలను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కొట్టిపారేశాడు.(వార్నర్‌ను ట్రోల్‌ చేసిన అశ్విన్‌)‌

మరిన్ని వార్తలు