'ధోనికున్న మ‌ద్ద‌తు కోహ్లికి లేదు.. అందుకే విఫ‌లం'

10 Jul, 2020 20:24 IST|Sakshi

ఢిల్లీ : టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లి ఎంత విజ‌య‌వంత‌మైన నాయ‌కుడ‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. కానీ ఐపీఎల్‌కు వ‌చ్చేస‌రికి మాత్రం కోహ్లి  కెప్టెన్‌గా తేలిపోతాడ‌నేది ఎన్నోసార్లు రుజువైంది. ఎందుకంటే  కోహ్లి రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్‌గా ఎంపికైన త‌ర్వాత ఒక్క‌సారి కూడా ఆ జ‌ట్టు క‌ప్పు గెల‌వ‌లేదు. అయితే  ఇది కోహ్లి త‌ప్పు కాద‌ని.. జ‌ట్టు మేనేజ్‌మెంట్, టీంలోని ఆట‌గాళ్లు అత‌నికి స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతోనే కెప్టెన్‌గా కోహ్లి విఫ‌ల‌మ‌య్యాడ‌ని మాజీ క్రికెట‌ర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఆకాశ్ చోప్రా త‌న యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు. ('కెప్టెన్‌గా నాకు పూర్తి స్వేచ్ఛనివ్వ‌లేదు')

'ఆర్‌సీబీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడానికి జట్టు మేనేజ్‌మెంటే కారణం. జ‌ట్టు కెప్టెన్‌గా ఉన్న‌ కోహ్లీ సలహాలను, సూచనలను జట్టు యాజమాన్యం పట్టించుకోదు. కనీసం ఆటగాళ్ల ఎంపికలో కూడా కోహ్లీ నిర్ణయాలకు విలువివ్వదు.  ఉదాహ‌ర‌ణ‌కు చైన్నై సూప‌ర్‌కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న ఎంఎస్ ధోని విజ‌య‌వంత‌మైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకోవ‌డానికి జ‌ట్టు మేనేజ్‌మెంట్‌తో పాటు జ‌ట్టులోని ఆట‌గాళ్లు స‌హ‌క‌రించ‌డమే కార‌ణం. కానీ కోహ్లి విష‌యంలో అలా జ‌ర‌గ‌లేదు.

అయితే జ‌ట్టుగా ఆర్‌సీబీ కూడా  ఏనాడు గొప్ప ప్రదర్శనలు చేయలేదు. ఒకటి, రెండేళ్లు కాదు.. ఎన్నో సీజన్లుగా ఇదే తీరు కొనసాగుతోంది. దీనికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా జట్టు ఎంపికలో సరైన ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడం.. ప్రతి సీజన్‌లో ఆర్‌సీబీ జట్టులో ఏదో లోటు కనపడుతూనే ఉంటుంది. జట్టులో సరైన ఫాస్ట్ బౌలర్లు ఉండరు. 5, 6 స్థానాల్లో పటిష్ఠమైన బ్యాటింగ్ లైనప్ లేకపోవడం.ఇలా అనేక సమస్యలు ఆర్సీబీలో కనపడతాయి. ఈ సమస్యలపై ఆ జట్టు యాజమాన్యం ఎప్పుడూ దృష్టి సారించదు. దీనిపై కోహ్లీ నిర్ణయాలను కూడా యాజమాన్యం పరిగణలోకి తీసుకుంటుందని నేననుకోవడం లేదు. అందుకే కోహ్లి ఐపీఎల్‌లో ఓ ఫెయిల్యూర్ కెప్టెన్‌గా మిగిలిపోయాడు ' అంటూ  ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. (భార‌త అభిమానుల గుండె ప‌గిలిన రోజు)

మరిన్ని వార్తలు