‘ఆఫ్రిది పాపం పండింది.. కరోనా సోకింది’

14 Jun, 2020 12:24 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ సారథి షాహిద్‌ అఫ్రిదికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో క్రికెట్‌ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దురదృష్టవశాత్తు తనకు కరోనా సోకిందని స్వయంగా అఫ్రిది ట్విటర్‌లో తెలిపిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న తాజా, మాజీ ఆటగాళ్లు, నెటిజన్లు అతడు త్వరగా కోలుకోవాలని సోషల్‌ మీడియా వేదికగా ఆకాంక్షించారు. ఆఫ్రిదికి బద్ద శత్రువు అయినటువంటి టీమిండియా మాజీ ఓపెనర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ సైతం పాక్‌ క్రికెటర్‌ కరోనా నుంచి కోలుకోవాలని కోరుకున్నాడు. (షాహిద్‌ అఫ్రిదికి కరోనా)

అయితే మరోవైపు అఫ్రిదికి కరోనా సోకడంపై కొంతమంది నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అతడిపై  పలు కరోనా జోకులు వేస్తున్నారు. ‘అఫ్రిది పాపం పండింది.. కరోనా సోకింది’, ‘అఫ్రిది చేసిన దుశ్చర్యలకు తగిన శిక్ష పడింది’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అంతేకాకుండా ఆఫ్రిదికి కరోనా సోకడంపై ఫన్నీ మీమ్స్‌, వీడియోలు క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. దీనిపై టీమిండియా మాజీ టెస్టు ఓపెనర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి సున్నితమైన అంశాలపై ఇలాగేనా వ్యవహరించేదని నెటిజన్లను ప్రశ్నించాడు. మానవత్వంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశాడు. గతంలో అతడు ఏం చేశాడో పక్కకు పెట్టాలన్నాడు. అంతేకాకుండా అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆకాశ్‌ చోప్రా ట్వీట్‌ చేశాడు. (ఆఫ్రిదికి కరోనా.. గంభీర్‌ రియాక్షన్‌)  

మరిన్ని వార్తలు