భయంతో షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోని కెప్టెన్లు

13 Mar, 2020 12:05 IST|Sakshi

సిడ్నీ : ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌ ప్రభావం క్రీడలకు పాకిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫుట్‌బాల్‌, క్రికెట్‌, ఇతర క్రీడలకు చెందిన పలు సిరీస్‌లు కోవిడ్‌ ప్రభావంతో రద్దయ్యాయి. ఒకవేళ మ్యాచ్‌లు జరిగినా మైదానంలో ప్రేక్షకులు లేకుండా ఆడాల్సి వస్తుంది. తాజాగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టాస్‌ వేసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో టాస్‌ వేసిన తర్వాత ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌,కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వబోయాడు. అయితే వెంటనే ఫించ్‌ తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. ఈ ఉదంతంతో ఇరు కెప్టెన్ల ముఖాల్లో నవ్వు వెల్లివిరిసింది. తర్వాత కేన్‌ విలియమ్సన్‌, ఫించ్‌లు తమ మోచేతులతో ట్యాప్‌ చేసుకున్నారు. (ఆసీస్‌ క్రికెటర్‌కు ‘కరోనా’ టెస్టులు.. వన్డేకు దూరం!)

షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోవడానికి భయపడుతున్నారంటే కరోనా వైరస్‌ ఎంతలా ప్రభావం చూపిస్తుందో తెలుస్తూనే ఉంది.ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకోకుండా కేవలం 'నమస్తే'తోనే సరిపెట్టుకుంటున్నారు. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ర్టేలియా తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. 'క్రికెట్‌లో హ్యాండ్‌ షేక్‌ బాగా అలవాటైపోయింది.. ఇప్పుడు మోచేతితో అంటే కష్టమే అంటూ ఇరు కెప్టెన్లు అనుకుంటున్నట్లుగా' కాప్షన్‌ పెట్టారు. అయితే మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఆసీస్‌ బౌలర్‌ కేన్‌ రిచర్డ్‌సన్‌కు కరోనా సోకిందని అనుమానం రావడంతో మ్యాచ్‌ నుంచి తొలగించారు. ప్రస్తుతం రిచర్డ్‌సన్‌కు కోవిడ్‌కు సంబంధించిన టెస్టులు పూర్తి చేశామని, వాటి రిపోర్ట్స్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. కాగా ఆసీస్‌- న్యూజిలాండ్‌ మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. శుక్రవారం మొదటి వన్డేలో భాగంగా టాస్‌ గెలిచిన ఆసీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. కరోనా ప్రభావంతో  ఇరు జట్ల మధ్య జరగనున్న సిరీస్‌లో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు జరగడం విశేషం. ('కోహ్లి నా దగ్గర సలహాలు తీసుకునేవాడు')

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు