విధ్వంసక క్రికెటర్ అరుదైన ఘనత

19 Jan, 2018 19:03 IST|Sakshi

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా జట్టుపై రెండో వన్డేలోనూ ఇంగ్లండ్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు 2-0తో ఆధిక్యాన్ని సంపాదించుకుంది. అయితే ఆసీస్ జట్టు ఓడిపోయినా విధ్వసంక క్రికెటర్ అరోన్ ఫించ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఫించ్ ‌(114 బంతుల్లో 106, 9 ఫోర్లు, 1 సిక్స్‌) చేసిన శతకం వన్డేల్లో అతడికిది 10వ సెంచరీ. తద్వారా వన్డేల్లో అతి తక్కువ (83) ఇన్నింగ్స్‌ల్లో 10 వన్డే శతకాలు బాదిన ఆస్ట్రేలియా క్రికెటర్‌గా ఫించ్ నిలిచాడు.

గతంలో ఈ రికార్డు ఆసీస్ విధ్వంసక ఆటగాడు డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. 10 వన్డే శతకాలు చేయడానికి వార్నర్ 85 ఇన్నింగ్స్‌లు ఆడగా.. అంతకు రెండు తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే ఫించ్ ఈ ఫీట్ నెలకొల్పాడు. ఇతర ఆసీస్ ఆటగాళ్లు మార్క్ వా (125 ఇన్నింగ్స్‌లు), మాథ్యూ హెడెన్ (138 ఇన్నింగ్స్‌)లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కెరీర్‌లో ఫించ్ చేసిన వన్డే శతకాల్లో సగం (5) ఇంగ్లండ్ జట్టుపైనే చేయడం విశేషం. కేవలం 18 ఇన్నింగ్స్‌ల్లోనే ఇంగ్లండ్ పై ఫించ్ ఈ శతకాలు చేశాడు.

క్వింటన్‌ డికాక్ ఫాస్టెస్ట్
ఓవరాల్‌గా చూసుకుంటే.. దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్‌ డికాక్ అతి తక్కువ ఇన్నింగ్స్‌ ల్లో 10 వన్డే సెంచరీలు చేసిన క్రికెటర్. డికాక్ 55 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ నమోదు చేయగా, హషీం ఆమ్లా (57), శిఖర్ ధావన్‌ (77), విరాట్ కోహ్లీ 80 ఇన్నింగ్స్‌లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టాప్-5లో ఇద్దరు భారత క్రికెటర్లు ఉండటం గమనార్హం.

మరిన్ని వార్తలు