రియల్ క్లియర్‌ గేమ్‌ ప్లాన్‌ ఉంది: ఫించ్‌

18 Feb, 2019 15:24 IST|Sakshi

మెల్‌బోర్న్‌: త్వరలో టీమిండియాతో ఆరంభం కానున్న ద్వైపాక్షిక సిరీస్‌లో సత్తాచాటుతామని అంటున్నాడు ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌. ఇందుకు కచ్చితమైన ప్రణాళికలతో భారత్‌తో పోరుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించాడు. భారత్‌ను వారి దేశంలో ఓడించడం అంత ఈజీ కాకపోయినప్పటికీ, తాము అనుకున్న గేమ్‌ ప్లాన్‌ అమలు చేసి పైచేయి సాధిస్తామన్నాడు. ‘ సొంత గడ్డపై టీమిండియా చాలా ప్రమాదకరమైన జట్టు. స్వదేశీ వన్డేల్లో భారత్‌ తిరుగులేని శక్తిగా ఉంది. కానీ మేము పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాం. మా దగ్గర టీమిండియాను ఓడించడానికి రియల్ క్లియర్‌ గేమ్‌ ప్లాన్‌ ఉంది’ అని ఫించ్‌ పేర్కొన్నాడు.

బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)టైటిల్‌ను తొలిసారి సాధించిన మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ జట్టుకు సారథ్యం వహించిన ఫించ్‌ మ్యాచ్‌ తర్వాత మాట్లాడుతూ.. భారత్‌తో సిరీస్‌లో విజయం సాధించడంపైనే దృష్టి సారించామన్నాడు. తమ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి ప్రోది చేసుకోవాలంటే భారత్‌ను వారి దేశంలో ఓడించడమే ఒక్కటే మార్గమన‍్నాడు. ఫిబ్రవరి 24వ తేదీన  భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆరంభం కానుంది. ఇందులో రెండు టీ20ల సిరీస్‌తో పాటు ఐదు వన్డేల సిరీస్‌ జరుగనుంది.

మరిన్ని వార్తలు