ఫించ్‌ మరో సెంచరీ 

26 Mar, 2019 01:13 IST|Sakshi

రెండో వన్డేలోనూ ఆసీస్‌దే గెలుపు  

షార్జా: కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (143 బంతుల్లో 153 నాటౌట్‌; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) మరో సెంచరీ చేయడంతో... పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి వన్డేలోనూ ఫించ్‌ సెంచరీ చేసి ఆసీస్‌ విజయంలో ముఖ్యపాత్ర పోషించగా... రెండో వన్డేలోనూ అతను కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 284 పరుగులు చేసింది. మొహమ్మద్‌ రిజ్వాన్‌ (126 బంతుల్లో 115; 11 ఫోర్లు) సెంచరీ చేయగా... షోయబ్‌ మాలిక్‌ (61 బంతుల్లో 60; 3 ఫోర్లు, సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించాడు. ఆసీస్‌ బౌలర్లలో రిచర్డ్సన్, కూల్టర్‌నీల్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.

285 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ 47.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఉస్మాన్‌ ఖాజా (109 బంతుల్లో 88; 8 ఫోర్లు)తో కలిసి ఫించ్‌ తొలి వికెట్‌కు 209 పరుగులు జోడించడం విశేషం. ఖాజా, మ్యాక్స్‌వెల్‌ ఔటయ్యాక షాన్‌ మార్‌‡్ష (11 నాటౌట్‌)తో కలిసి ఫించ్‌ ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. 1996లో మార్క్‌ వా తర్వాత ఆసియాలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు చేసిన తొలి ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌గా ఫించ్‌ ఘనత వహించాడు. మూడో వన్డే అబుదాబిలో బుధవారం జరుగుతుంది. 

మరిన్ని వార్తలు