ఘోర ఓటమిపై ఫించ్‌ అసంతృప్తి

12 Jul, 2019 17:22 IST|Sakshi

బర్మింగ్‌హామ్ ‌: ప్రపంచకప్‌ కోసం ఏడాదిగా కష్టపడ్డామని కానీ ఓ చెత్త ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించడం బాధకలిగిస్తోందని ఆస్ట్రేలియా సారిథి ఆరోన్‌ ఫించ్‌ పేర్కొన్నాడు. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ 8 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. అయితే ప్రపంచకప్‌లో 27 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ తొలిసారి ఫైనల్‌ చేరగా.. ఆసీస్‌ క్రికెట్‌ చరిత్రలో మొదటిసారి సెమీస్‌లో ఓటమి చవిచూసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్‌ కనీసం ఫైనల్‌కు చేరకుండానే నిష్క్రమించడంపై ఆసీస్‌ సారథి ఫించ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇం‍గ్లండ్‌తో మ్యాచ్‌ అనంతరం ఫించ్‌ మీడియా సమావేశంలో మాట్లాడాడు. 

‘టీమిండియా, పాకిస్తాన్ వంటి బలమైన జట్లపై వన్డే సిరీస్‌లు నెగ్గడంతో ఆత్మవిశ్వాసంతో ప్రపంచకప్‌ బరిలోకి దిగాం. బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం అనంతర ఏడాది పాటు మా ప్రయాణం కష్టంగా సాగింది. అయితే ఆటగాళ్లు మానసికంగా చాలా పరిపక్వతను ప్రదర్శించారు. తిరిగి గాడిలో పడి ప్రపంచకప్‌లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగాం. లీగ్‌లో చాంపియన్‌ ఆటనే ప్రదర్శించాం. కానీ ఇంగ్లండ్‌పై మా అంచనాలు తలకిందులు అయ్యాయి. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌లో చెలరేగుతుందని అనుకున్నాం.. కానీ బౌలింగ్‌లో చెలరేగా మమల్ని షాక్‌కు గురిచేసింది. వోక్స్‌, ఆర్చర్‌లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. 

కష్టకాలంలో స్టీవ్‌ స్మిత్‌, అలెక్స్‌ క్యారీలు అద్భుత పోరాట పటిమను ప్రదర్శించారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో మేము అన్ని రంగాల్లో విఫలమయ్యాం. ఆర్చర్‌కు మంచి భవిష్యత్‌ ఉంది. చెత్త ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించడం బాధ కలిగించింది. ఈ ఓటమి ప్రభావం త్వరలో జరగబోయే యాషెస్‌ సిరీస్‌పై ఉండదని భావిస్తున్నా’అంటూ ఫించ్‌ వివరించాడు. ఇక సెమీస్‌లో తమ జట్టు కనీసం పోరాడకుండానే ఓడిపోవడంపై ఆసీస్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు