వాయిదా పడితే నేనాడేది కష్టమే

14 Apr, 2020 05:56 IST|Sakshi

పునరాగమనంపై ఏబీ డివిలియర్స్‌

జొహన్నెస్‌బర్గ్‌: కోచ్‌ మార్క్‌బౌచర్‌ కోరిక మేరకు పునరాగమనం చేస్తానన్న దక్షిణాఫ్రికా ‘మిస్టర్‌ 360’ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ టి20 ప్రపంచకప్‌ వాయిదా పడితే మాత్రం ఆడేది అనుమానమేనన్నాడు. ఆసీస్‌ ఆతిథ్యమిచ్చే టి20 ప్రపంచకప్‌ అక్టోబర్‌లో జరగాల్సి ఉంది. అయితే ప్రపంచాన్ని కోవిడ్‌–19 చుట్టేయడంతో ప్రతీ టోర్నీ వాయిదా లేదంటే రద్దు తప్పడంలేదు. ఈ నేపథ్యంలో ఆఫ్రికా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ‘ఆరు నెలల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడెలా చూసేది. ఒకవేళ ప్రపంచకప్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడితే ఎన్నో మారిపోతాయి. ఇప్పుడైతే నేను వందశాతం ఆడేందుకు సిద్ధమే. కానీ వచ్చే ఏడాది నా శరీరం సహకరిస్తుందో లేదో! కాబట్టి తప్పుడు ఆశల్ని కల్పించను’ అని అన్నాడు.

బౌచర్‌ (కోచ్‌) అడిగినప్పుడు ఆసక్తి కనబరిచానని, ఇప్పుడు వాయిదా పడితే మాత్రం పునరాగమనం కష్టమేనన్నాడు. ‘నేను వందశాతం ఫిట్‌గా ఉంటేనే ఆడతాను. లేదంటే ఆడను. కొందరిలా... 80 శాతం ఫిట్‌నెస్‌ ఉన్నా ఆడేందుకు రెడీ అనే సంకేతాలు ఇచ్చే వ్యక్తిని  కాదు’ అని ఏబీ స్పష్టం చేశాడు. గత వన్డే ప్రపంచకప్‌కు ముందు, తర్వాత తలెత్తిన వివాదం మరోసారి రేగేందుకు తనకు ఎంతమాత్రం ఇష్టం లేదన్నాడు. 2018లో రిటైర్మెంట్‌ ప్రకటించిన డివిలియర్స్‌ గత మెగా ఈవెంట్‌ ఆడేందుకు ఆసక్తి కనబరిచినా... దక్షిణాఫ్రికా జట్టు ససేమిరా అంది. ఈ మేటి బ్యాట్స్‌మన్‌ లేని సఫారీ జట్టు ఇంగ్లండ్‌ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో లీగ్‌ దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో ఏబీని నిర్లక్ష్యం చేశారనే విమర్శలు దక్షిణాఫ్రికాను ఉక్కిరిబిక్కిరి చేశాయి. 

మరిన్ని వార్తలు