కోచ్‌ వ్యాఖ్యలు ఏబీని బాధించాయా?

13 Apr, 2020 16:15 IST|Sakshi

నేను ఆడటం గ్యారంటీ లేదు

తప్పుడు సంకేతాలు ఇవ్వలేను..

కేప్‌టౌన్‌: తన రీఎంట్రీపై దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ ఆశలు వదులుకున్నట్లే కనబడుతోంది. ప్రస్తుతం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) వాయిదా పడటంతో ఏబీ డైలమాలో పడ్డాడు. ప్రధానంగా కరోనా మహమ్మారి కారణంగా మొత్తం క్రీడా ఈవెంట్లన్నీ రద్దు కావడంతో ఏబీ ఆలోచనలో పడ్డాడు. ఒకవేళ ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే వరల్డ్‌ టీ20 కూడా వాయిదా పడితే మాత్రం తన రీఎంట్రీపై ఆలోచన చేయాల్సిందేనన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను ఆడటానికి సిద్ధంగా ఉన్నా, టీ20 వరల్డ్‌కప్‌ ఏడాది పాటు వాయిదా పడితే తాను ఆడటంపై గ్యారంటీ ఉండదన్నాడు.  `ప్ర‌స్తుత ప‌రిస్థితులు క్రికెట్‌కు అనుకూలంగా లేవు. ఒక‌వేళ మెగాటోర్నీ వ‌చ్చే ఏడాదికి వాయిదా ప‌డితే అనేక మార్పులు వ‌స్తాయి.  నేను జ‌ట్టుకు తిరిగి అందుబాటులో ఉండాల‌నుకున్నా. ఈ అంశంపై నా సన్నిహితుడు, కోచ్‌ మార్క్ బౌచ‌ర్‌తో మాట్లాడా. నేను వంద శాతం ఫిట్‌గా ఉంటేనే ఆడతాను. నేను కచ్చితంగా ఆడతాననే తప్పుడు సంకేతాలు ఇవ్వలేను. అప్పటి పరిస్థితిని బట్టి ఉంటుంది. నా శరీరం అనుకూలించి అన్నీ కుదిరితే ఆడతా. ఇక్కడ మాత్రం గ్యారంటీ అయితే లేదు’ అని ఏబీ తెలిపాడు. (ఏబీ ఫామ్‌లో ఉంటేనే: బౌచర్‌)

2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ఏబీ.. 2019 జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆడాలని యత్నించాడు.అయితే అది కుదరకపోవడంతో వరల్ఢ్‌ టీ20 ఆడాలని నిశ్చయించుకున్నాడు.  దక్షిణాఫ్రికా హెడ్‌ కోచ్‌గా మార్క్‌ బౌచర్‌ నియామకం జరగడంతో డివిలియర్స్‌ రీఎంట్రీ షురూ అయ్యింది. దీనిపై డివిలియర్స్‌ రావాలనుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసిన బౌచర్‌..  టీ20 వరల్డ్‌కప్‌కు అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన జట్టును తయారు చేయాలని యత్నిస్తున్నాడు. దాంతోనే కోచ్‌ పగ్గాలు చేపట్టిన వెంటనే తన సహచర క్రికెటర్లలో ఒకడైన ఏబీతో స్వయంగా మాట్లాడి మరీ ఒప్పించాడు.

కోచ్‌ వ్యాఖ్యలు ఏబీని బాధించాయా?
ఈ ఏడాది ఫిబ్రవరిలో సఫారీ కోచ్‌ మార్క్‌ బౌచర్‌ మాట్లాడుతూ ఏబీ ఫామ్‌లో ఉంటేనే టీ20 వరల్డ్‌కప్‌కు తీసుకుంటామంటూ యూటర్న్‌ తీసుకున్నాడు. తొలుత జట్టులో స్థానంపై భరోసా కల్పించిన బౌచర్‌.. ఏబీ తన రోల్‌కు న్యాయం చేయగలడని భావిస్తేనే చోటు కల్పిస్తామన్నాడు. ఆ వరల్డ్‌కప్‌కు అత్యున్నత జట్టును సిద్ధం చేస్తున్నామన్న బౌచర్‌.. ఇక్కడ ఎటువంటి ఇగోలకు తావులేదన్నాడు.  ఏబీ ఫామ్‌లో ఉండి సరైన వాడు అనుకుంటే టీ20 వరల్డ్‌కప్‌లో అతని ఎంపిక ఉంటుందని తేల్చి చెప్పాడు. అంటే ఏబీ ఫామ్‌లో లేకపోతే మాత్రం జట్టులో కష్టం అనేది బౌచర్‌ మాటల్ని బట్టి అర్థమవుతుంది. ఈ వ్యాఖ్యలు కచ్చితంగా ఏబీని బాధించే ఉంటాయి. 

కాగా, టీ20 వరల్డ్‌కప్‌ కంటే ముందు ఐపీఎల్‌ ఉండటంతో ఏబీ అప్పట్లో ఏమీ మాట్లాడలేదు. ఐపీఎల్‌లో తన మార్కు ఆట చూపెట్టి కోచ్‌ బౌచర్‌కు బ్యాట్‌తోనే సమాధానం చెబుదామని ఏబీ భావించి ఉండొచ్చు. కానీ ఐపీఎల్‌ ఇప్పట్లో జరిగే పరిస్థితులు లేకపోవడంతో ఏబీని టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయడం కష్టం. ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్‌ పూర్తిగా రద్దైతే ఏబీ ఫామ్‌ ఎలా బయటకొస్తుంది. ఏబీ తాజా మాటల్ని బట్టి ఐపీఎల్‌ జరగదనే ఫిక్స్‌ అయిపోయినట్లున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో చోటుపై పెదవి విప్పడానికి ఇదే కారణం కావొచ్చు. ఎలాగూ తన స్థానంపై కోచ్‌ నుంచి గ్యారంటీ లేదు.. అటువంటప్పుడు తాను ఆడటం కుదరని పని ఏబీ గ్రహించే ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు.

మరిన్ని వార్తలు