63 ఏళ్ల తర్వాత రికార్డు బౌలింగ్‌

20 Sep, 2019 11:09 IST|Sakshi

లండన్‌:  సుమారు రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పి కౌంటీ చాంపియన్‌షిప్‌ ఆడుతున్న దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ కేల్‌ అబాల్‌ తన బౌలింగ్‌లో పదును తగ్గలేదని నిరూపించాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా హాంప్‌షైర్‌ తరఫున ఆడుతున్న అబాట్‌.. సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో అసాధారణ గణాంకాలు నమోదు చేశాడు. రెండు  ఇన్నింగ్స్‌ల్లో  కలిపి 17 వికెట్లతో చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు  సాధించిన అబాట్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లతో విజృంభించాడు. ఫలితంగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 63 ఏళ్ల తర్వాత అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు.

1956లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్‌ జిమ్‌ లేకర్‌ 19 వికెట్లు  సాధించగా, ఆ తర్వాత స్థానాన్ని అబాట్‌ ఆక్రమించాడు. మరొకవైపు గత 80  ఏళ్ల నుంచి చూస్తే కౌంటీ చాంపియన్‌షిప్‌లో అబాట్‌ సాధించిన 17 వికెట్లు ఘనతే అత్యుత్తమంగా నిలిచింది. ఫలితంగా కౌంటీ చాంపియన్‌షిప్‌లో అబాట్‌  సరికొత్త రికార్డు  సృష్టించాడు. కాగా, ఓవరాల్‌ కౌంటీ చాంపియన్‌షిప్‌లో నాల్గో అత్యుత్తమ బౌలర్‌గా అబాట్‌ గుర్తింపు సాధించాడు.

ఈ మ్యాచ్‌లో హాంప్‌షైర్‌ 136  పరుగుల తేడాతో విజయం సాధించింది. సోమర్‌సెట్‌ విజయానికి 281 పరుగులు అవసరం కాగా, ఆ జట్టు అబాట్‌ దెబ్బకు 144 పరుగులకే కుప్పకూలింది.అబాట్‌ తన అంతర్జాతీయ కెరీర్‌లో 11 టెస్టులు, 28 వన్డేలు ఆడాడు. ఇక 21 అంతర్జాతీయ టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. 2013లో సఫారీల తరఫున అరంగేట్రం చేసిన అబాట్‌.. నాలుగేళ్లకే తన కెరీర్‌కు వీడ్కోలు చెప్పాడు. కుడిచేతి వాటం బౌలర్‌ అయిన అబాట్‌ తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో  113 మ్యాచ్‌లు ఆడి 439 వికెట్లు  సాధించాడు. అందులో 30 సార్లు ఐదు వికెట్ల మార్కును అందుకున్నాడు.

మరిన్ని వార్తలు