'టాప్' నుంచి వైదొలిగిన అభినవ్ బింద్రా

29 Oct, 2015 17:51 IST|Sakshi
'టాప్' నుంచి వైదొలిగిన అభినవ్ బింద్రా

న్యూఢిల్లీ: టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం నుంచి ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, భారత ప్రఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా వైదొలిగాడు.  రియో ఒలింపిక్స్ కు ఇంకా పది నెలలు సమయం మాత్రమే ఉన్నందున తాను టాప్ పథకం నుంచి తప్పుకుంటున్నట్లు బింద్రా ప్రకటించాడు. ఈ మేరకు 'టాప్' చైర్మన్ థాకూర్ కు ఓ లేఖ రాశాడు. 'నేను ఇప్పటికే ప్రాక్టీస్ లో నిమగ్నమై ఉన్నాను. ఒలింపిక్స్ కు చాలా తక్కువ సమయం ఉంది.  ఈ సమయంలో నేను టాప్ లో సభ్యునిగా ఉండటం సరైన నిర్ణయం కాదనుకుంటున్నాను.  ఆ కారణం చేత వైదులుగుతున్నాను' అని బింద్రా లేఖలో పేర్కొన్నాడు.

 

ఒలింపిక్స్‌లో భారత్ తరఫున వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణం సాధించిన ఏకైక షూటర్ అభినవ్ బింద్రా వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. గత మే నెలలో మ్యూనిచ్‌లో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో బింద్రా ఆరో స్థానంలో నిలవడం ద్వారా రియో బెర్త్ దక్కించుకున్నాడు. దీంతో బింద్రా ఒలింపిక్స్‌ కు ఐదోసారి అర్హత సాధించాడు. రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే అవకాశం ఉన్న ఆటగాళ్లకు మరింత అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసేందే టాప్.  ఇప్పటికే శిక్షణతో బిజీగా ఉన్న బింద్రా.. తాను టాప్ నుంచి తప్పుకోవడమే ఉత్తమమని భావించి ఆ పథకం నుంచి తప్పుకున్నాడు.

మరిన్ని వార్తలు