బంగారు కల నెరవేరిన వేళ...

30 Apr, 2020 00:39 IST|Sakshi
అభినవ్‌ బింద్రా

ఆ జ్ఞాపకాలన్నీ...

2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన అభినవ్‌ బింద్రా

ఒలింపిక్స్‌లో భారత్‌కు వ్యక్తిగత పసిడి పతకం అందించిన తొలి ప్లేయర్‌గా ఘనత

ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఎనిమిది బంగారు పతకాల స్వర్ణయుగం 1980తోనే ముగిసింది. తర్వాతి మూడు ఒలింపిక్స్‌లలోనూ మన దేశం రిక్తహస్తాలతోనే వెనుదిరిగింది. ఆ తర్వాత లియాండర్‌ పేస్, కరణం మల్లేశ్వరి, రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ల ప్రదర్శనతో రెండు కాంస్యాలు, ఒక రజతం మాత్రం వచ్చాయి. కానీ వ్యక్తిగత స్వర్ణం... ఇన్నేళ్లయినా అది భారత్‌కు స్వప్నంగా మారిపోయింది. ఎట్టకేలకు 2008లో ఆ రాత మారింది. పాతికేళ్ల కుర్రాడి తుపాకీ నుంచి దూసుకొచ్చిన ఒక బుల్లెట్‌ సరిగ్గా పసిడి లక్ష్యాన్ని తాకింది. దాంతో విశ్వ క్రీడల్లో మన దేశానికి తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని అందించిన అభినవ్‌ బింద్రా చరిత్రకెక్కాడు. అతని ప్రదర్శన కారణంగా ఆ క్షణాన పోడియంపై వినిపించిన జనగణమన ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేసింది.  

‘నా జీవితంలో ఇది ఎప్పటికీ మరిచిపోలేని చీకటి రోజు’... 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో ప్రదర్శన తర్వాత అభినవ్‌ బింద్రా తన సన్నిహితులతో చేసిన వ్యాఖ్య ఇది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్లో 7వ స్థానంలో నిలిచిన తర్వాత అతను ఈ మాట అన్నాడు. మరి ఇలా అయితే తర్వాతి లక్ష్యం ఏమిటి... వెంటనే మిత్రులు అడిగారు. ఏముంది, మరో నాలుగేళ్లు శ్రమించడమే అంటూ బింద్రా చిరునవ్వుతో జవాబిచ్చాడు.

అంతకుముందు నాలుగేళ్ల క్రితమే 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కూడా అత్యంత పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా బింద్రా పాల్గొన్నాడు. అయితే అప్పుడు క్వాలిఫయింగ్‌లో 11వ స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయాడు. ఇలాంటి స్థితిలో మరో నాలుగేళ్లు కష్టపడాలంటే ఎంతో ఓపిక, పట్టుదల, పోరాటతత్వం ఉండాలి. కానీ బింద్రా అన్నింటికీ సిద్ధపడ్డాడు.

ఒకే లక్ష్యంతో...
బింద్రా కలవారి బిడ్డ. డబ్బుకు ఎలాంటి లోటు లేదు. ప్రాక్టీస్‌కు సమస్య రాకుండా ఇంట్లోనే తండ్రి సొంతంగా షూటింగ్‌ రేంజ్‌ కూడా ఏర్పాటు చేశాడు. అయితే ఇది మాత్రమే సరిపోదు. ఇంకా బయటకు కనిపించని, తనకు మాత్రమే తెలిసిన ఇతర లోపాలున్నాయనేది బింద్రా గుర్తించాడు. అన్నింటికి మించి తన ఫిట్‌నెస్‌ స్థాయికి తగినట్లుగా లేదని అతనికి అర్థమైంది. 4 కిలోల షూటింగ్‌ సూట్, 5 కిలోల గన్‌తో గురి కుదరడం లేదని తెలిసింది. అంతే... ఆరు నెలలు రైఫిల్‌కు విరామం ఇచ్చి పూర్తిగా ఫిట్‌గా మారడంపై దృష్టి పెట్టాడు. శరీరాన్ని దృఢంగా మార్చుకున్నాడు.

బింద్రాకు కోచ్‌ గాబ్రియేలా అభినందన

ఒక దశలో విరామం లేకుండా పది నిమిషాలు పరుగెత్తడమే కష్టంగా కనిపించిన అతను కనీసం గంటన్నర పాటు ఆగకుండా పరుగెత్తసాగాడు. కీలక సమయంలో బింద్రా లోపాలను సరిదిద్ది అతని షూటింగ్‌ను తీర్చి దిద్దడంలో స్విట్జర్లాండ్‌ మహిళా కోచ్‌ గాబ్రియేలా బుల్‌మన్‌ పాత్ర కీలకమైంది.  1988 నుంచి 2004 వరుసగా ఐదు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న గాబ్రియేలా... ముఖ్యంగా బింద్రా వెన్నుపై భారం పడకుండా సరైన పొజిషనింగ్‌తో షూటింగ్‌ చేయడంలో అతడిని తీర్చిదిద్దింది. ఇక బీజింగ్‌కు అతను ఏమాత్రం ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా వెళ్లాడు. ఈసారి ఫలితం గురించి ఆలోచించను, నేను షూటింగ్‌ చేసేందుకు మాత్రమే వెళుతున్నా అని ముందే చెప్పేశాడు.  

అలా సాధించాడు...
విజయానికి, పరాజయానికి మధ్య వెంట్రుకవాసి తేడా మాత్రమే ఉండే షూటింగ్‌లో మరోసారి తన అదృష్టం పరీక్షించుకునేందుకు అభినవ్‌ సిద్ధమయ్యాడు. క్వాలిఫయింగ్‌లో 596 పాయింట్లు సాధించిన భారత షూటర్‌ నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఫైనల్లో బింద్రా అత్యుత్తమ ప్రదర్శన ముందు మిగతా షూటర్లు వెనుకబడ్డారు. మొత్తం పది రౌండ్లలోనూ ఒక్కసారి కూడా 10 పాయింట్లకు తగ్గకుండా బింద్రా మాత్రమే షూట్‌ చేయగలిగాడు. ఓవరాల్‌గా 700.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచిన బింద్రా భారత జాతి గర్వపడే ఘనతను సృష్టించాడు. 9వ రౌండ్‌ ముగిసేసరికి హెన్రీ హకినెన్‌ (ఫిన్లాండ్‌), బింద్రా సమాన పాయింట్లతో ఉన్నారు.

చివరి రౌండ్‌లో బింద్రా 10.8 పాయింట్లు స్కోరు చేయగా... తీవ్ర ఒత్తిడిలో హకినెన్‌ 9.7 పాయింట్లు మాత్రమే స్కోరు చేసి మూడో స్థానానికి పడిపోయాడు. ఆగస్టు 11, 2008న బింద్రా సాధించిన ఘనతతో భారత్‌ యావత్తూ పులకించింది. 28 ఏళ్ల తర్వాత సాంకేతికంగా భారత్‌ ఖాతాలో స్వర్ణపతకం చేరినా... వ్యక్తిగత విభాగంలో బంగారం గెలిచిన ఏకైక అథ్లెట్‌గా అతను చరిత్రలో నిలిచిపోయాడు. ఆ తర్వాత అభినవ్‌ 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో క్వాలిఫయింగ్‌ దశలోనే వెనుదిరగ్గా, 2016 రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో రెండో పతకాన్ని చేజార్చుకున్నాడు. అయితే బీజింగ్‌లో అతను స్వర్ణపతకాన్ని అందుకున్న క్షణం మన క్రీడాభిమానుల మదిలో ఎప్పటికీ చిరస్మరణీయం.  
    
సాక్షి క్రీడా విభాగం

మరిన్ని వార్తలు