విదేశాల్లో మినీ ఐపీఎల్!

24 Jun, 2016 23:26 IST|Sakshi
విదేశాల్లో మినీ ఐపీఎల్!

 సెప్టెంబర్‌లో యూఎస్ లేదా యూఏఈలో బీసీసీఐ వర్కింగ్ కమిటీ నిర్ణయం
 
ధర్మశాల: విదేశాల్లో ‘మినీ ఐపీఎల్’ పేరిట టి20 టోర్నమెంట్‌ను నిర్వహించడానికి బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సెప్టెంబర్‌లో అమెరికా లేదా యూఏఈలో ఎనిమిది జట్లతో ఈ టోర్నీని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు శుక్రవారం జరిగిన బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో దీంతో పాటు మరికొన్ని అంశాలపై కమిటీ చర్చించింది. ‘పొట్టి ఫార్మాట్‌లో టోర్నీ ఉంటుంది. ఇంటా, బయటా పద్ధతి ఉండదు కాబట్టి మ్యాచ్‌ల సంఖ్య కూడా తక్కువే. రెండు వారాల విండోలో ఈ టోర్నీని పూర్తి చేయాలి’ అని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. గతేడాది చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీని రద్దు చేసిన నేపథ్యంలో బోర్డు మినీ ఐపీఎల్‌ను తెరమీదకు తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. భారత జట్టు చీఫ్ కోచ్‌గా అనిల్ కుంబ్లే నియామాకానికి కూడా కమిటీ ఆమోద ముద్ర వేసింది. అండర్-19 క్రికెట్‌లోకి వచ్చే ఆటగాడు కేవలం రెండు సీజన్లు మాత్రమే ఆడాలన్న కమిటీ... అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఒకసారి మాత్రమే ఆడాలని నిబంధన విధించింది.  


టెస్టుల ప్రమోషన్‌కు ప్రత్యేక బడ్జెట్
టెస్టు క్రికెట్‌ను ప్రమోట్ చేసేందుకు ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయించాలని వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. ఈ సీజన్‌లో స్వదేశంలో 13 టెస్టులు జరగనున్న నేపథ్యంలో అంతర్జాతీయ మ్యాచ్‌లను బాగా మార్కెటింగ్ చేసేందుకు ఆయా రాష్ట్ర సంఘాలతో బోర్డు కలిసి పని చేయనుంది. రంజీ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించాలన్న టెక్నికల్ కమిటీ నిర్ణయాన్నీ బోర్డు ఆమోదించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ స్థానంలో కొత్తగా జోనల్ టి20 లీగ్‌ను ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని వార్తలు