టీ20 క్రికెట్‌ చరిత్రలో నయా రికార్డు

8 Aug, 2019 12:29 IST|Sakshi

లీసెస్టర్‌: టీ20 క్రికెట్‌ చరిత్రలో నయా రికార్డు లిఖించబడింది. దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ కొలిన్‌ అక్రమాన్‌ ఏడు వికెట్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విటలిటీ బ్లాస్‌ టీ20 లీగ్‌లో భాగంగా లీసెస్టర్‌ షైర్‌ కెప్టెన్‌ కొలిన్‌  ఆక్కర్‌మాన్‌ ఏడు వికెట్లతో చెలరేగిపోయాడు.  బుధవారం వార్విక్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో కొలిన్‌ తన స్పిన్‌ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ప్రత్యర్థి జట్టులోని మైకేల్‌ బర్గెస్‌, సామ్‌ హైన్‌, విల్‌ రోడ్స్‌, లియామ్‌ బ్యాంక్స్‌, అలెక్స్‌ థామ్సన్‌, హెన్రీ బ్రూక్స్‌, జీతన్‌ పటేల్‌ వికెట్లు సాధించాడు. దాంతో 20 పరుగుల వ్యవధిలో వార్విక్‌ షైర్‌ ఎనిమిది వికెట్లు కోల్పోయింది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన లీసెస్టర్‌ షైర్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. హరీ స్విండెల్స్‌(63), లూయిస్‌ హిల్‌(58)లు హాఫ్‌ సెంచరీలు సాధించి జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో తోడ్పడ్డారు. ఆపై 190 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్‌ ఆరంభించిన వార్విక్‌ షైర్‌ 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆపై సామ్‌ హైన్‌(61), ఆడమ్‌ హోస్‌(34)లు ఆదుకోవడంతో ఆ జట్టు మూడో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆ తరుణంలో కొలిన తన బౌలింగ్‌తో బెంబేలెత్తించాడు. అతనికి ధాటికి వార్విక్‌షైర్‌ 17.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది.

మరిన్ని వార్తలు