చైతన్య ఖాతాలో మరో స్వర్ణం

5 Aug, 2013 01:50 IST|Sakshi

బెల్‌ఫాస్ట్ (ఐర్లాండ్): ప్రపంచ పోలీస్, ఫైర్ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కానిస్టేబుల్ తులసి చైతన్య తన సంచలన ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఆదివారం జరిగిన పోటీల్లో మరో స్వర్ణంతో పాటు రజత పతకాన్ని గెలుచుకున్నాడు. దీంతో అతని పతకాల సంఖ్య మూడుకి చేరింది. విజయవాడకు చెందిన చైతన్య ఆదివారం 100 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో పసిడి పతకం గెలిచాడు. అనంతరం 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో రెండో స్థానంలో నిలిచి రజత పతకం చేజిక్కించుకున్నాడు. శనివారం చైతన్య 4ఁ50 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రీడల్లో మూడో పెద్ద ఈవెంట్ అయిన ఈ పోటీల్లో భారత పోలీస్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది.
 
 భారత క్రీడాకారులు ఇప్పటివరకు 12 బంగారు పతకాలు, ఆరు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు గెలిచారు. మొత్తం 56 దేశాలకు చెందిన సుమారు 7400 అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఇందులో 39 మందితో కూడిన భారత బృందం పోటీపడుతోంది. అథ్లెటిక్స్‌లో రవిందర్ (ఉత్తరాఖండ్), సినీ (కేరళ), స్విమ్మింగ్‌లో మందర్ దివాసే (బీఎస్‌ఎఫ్), జూడోలో కల్పనా దేవి (ఐటీబీపీ), నిరుపమ (సీఆర్‌పీఎఫ్), జీనా దేవి (ఎస్‌ఎస్‌బీ) పసిడి పతకాలు గెలిచారు. ముకేశ్ రావత్ (ఉత్తరాఖండ్), చించూ జోస్ (కేరళ), అనురాధ (పంజాబ్) రజతాలు నెగ్గగా... రాహుల్ (కేరళ), నేహా (సీఐఎస్‌ఎఫ్), రాజ్‌బీర్ (పంజాబ్), అవతార్ (పంజాబ్)లు కాంస్యాలు సాధించారు.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు