గిల్‌క్రిస్ట్‌నే కలవరపెట్టిన భారత బౌలర్‌..!!

13 Nov, 2019 18:08 IST|Sakshi

మెల్‌బోర్న్‌ : తన కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టతరమైన బౌలర్లలో భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఒకరని  ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ తెలిపారు. అదేవిధంగా శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ బౌలింగ్‌లో కూడా ఇబ్బంది పడినట్లు వెల్లడించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్‌లో 2001లో జరిగిన బోర్డర్‌- గవాస్కర్‌ సిరీస్‌లో 32వికెట్లు పడగొట్టిన భజ్జీ ఆసీస్‌కు కొరకరాని కొయ్యలా మారాడని ఈ సందర్భంగా గిల్‌క్రిస్ట్ గుర్తు చేసుకున్నాడు.

2001లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో టెస్టులో హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఈ టెస్టులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ముంబైలో జరిగిన తొలి టెస్టులో గిల్‌క్రిస్ట్ సెంచరీతో చెలరేగడంతో స్టీవ్ వా నాయకత్వంలోని ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తర్వాతి మ్యాచ్‌లలో హర్భజన్‌ చెలరేగడంతో భారత్‌ తదుపరి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. దీంతో గంగూలీ సారథ్యంలోని టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌ను చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. 

ఈ సందర్భంగా గిల్‌క్రిస్ట్‌ మాట్లాడుతూ.. 'ముంబైలో జరిగిన మొదటి మ్యాచ్‌లో మేము 99/5 స్థితిలో ఉన్న సమయంలో నేను క్రీజులోకి వెళ్లాను. 80 బంతుల్లో 100 పరుగులు చేశాను. అయితే ఆ టెస్టును మూడు రోజుల్లోనే గెలిచాం. ఇంత సులభంగా మ్యాచ్‌ గెలవగానే.. గత 30 సంవత్సరాలుగా మా జట్టు భారత్‌లో ఎందుకు సిరీస్‌ గెలవలేదు అని ప్రశ్నించుకునేవాడిని. కానీ.. తర్వాత భారత్‌లో టెస్టు సిరీస్‌ ఎంత కఠినమో త్వరగానే అర్థమైపోయింది. తర్వాతి టెస్టు మ్యాచ్ కోసం కోల్‌కతాకు వెళ్లాం. అక్కడ మమ్మల్ని భజ్జీ తన బౌలింగ్‌తో కలవర పెట్టాడు

నా కెరీర్‌లో నేను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన బౌలర్ భజ్జీనే. ఆ తర్వాత శ్రీలంక స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్. వీళ్లిద్దరూ నేను ఎదుర్కొన్న కష్టతరమైన బౌలర్లు. ఈ సిరీస్‌ ఓటమి తర్వాత టెస్ట్ క్రికెట్‌ విషయంలో మేము అనేక విషయాలను తెలుసుకున్నాం. ప్రతిసారి దాడి చేయడమే కాకుండా తమ వ్యూహాలను మార్చుకొని ఆడాల్సిన అవసరం ఉందని తెలుసుకున్నాం. 2001లో సిరీస్‌ చేజారి పోయాక మా వ్యూహాలను మార్చాం. ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడేందుకు దాడి చేయడం ఒకటే సరైన మార్గం కాదని తెలుసుకున్నాం. తర్వాత 2004లో భారత పర్యటనలో భాగంగా 35 సంవత్సరాల తర్వాత సిరీస్‌ను గెలవడం చాలాగొప్ప విషయం’అని గిల్‌క్రిస్ట్‌ పేర్కొన్నాడు. కాగా, ఈ సిరీస్‌లో చెన్నై టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో క్లిష్ట సమయంలో 49 పరుగులు చేసిన ఆడమ్‌, అవి తనకెంతో ప్రత్యేకమన్నారు. ఈ పర్యటనలో ఆసీస్‌ 2-1 తేడాతో టీమిండియాపై విజయం సాధించిన విషయం తెలిసిందే. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా