చాలా భయపడ్డాం: ఆడం జంపా

12 Oct, 2017 14:03 IST|Sakshi

గువాహటి: రెండో టీ-20 మ్యాచ్‌లో భారత్‌పై విజయం సాధించి.. సిరీస్‌ను సమం చేసిన ఆస్ట్రేలియా జట్టుకు బుధవారం గువాహటిలో భయానక అనుభవం ఎదురైంది. ఎవరో దుండగుడు వారు ప్రయాణిస్తున్న బస్సుపై రాయి విసిరాడు. దీంతో బస్సు అద్దం పగిలింది. భారత్‌పై విజయం అనంతరం టీమ్‌ బస్సులో ఆసీస్‌ ఆటగాళ్లు హోటల్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోయినప్పటికీ దీంతో ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు.

రెండో టీ20లో ఎంఎస్‌ ధోనీ, కేదార్‌ జాధవ్‌ వికెట్లు తీసి.. ఆసీస్ విజయానికి దోహదం చేసిన లెగ్‌ స్పిన్నర్‌ ఆడం జంపా ఈ ఘటనపై స్పందించాడు. ఈ ఘటన చాలా నిరాశ కలిగించిందని చెప్పాడు. 'అప్పుడు నేను హెడ్‌ఫోన్స్‌ పెట్టుకొని.. పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ వింటున్నాను. బస్సు అవతలివైపు చూస్తుండగా.. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. ఐదు సెకన్ల పాటు మేం చాలా భయపడ్డాం. ఎవరో రాయి విసిరి ఉంటారని మా సెక్యూరిటీ గార్డు చెప్పాడు. ఇది చాలా భయంకర ఘటన. ఇలాంటి ఘటనలు జరగకూడదు. ఈ ఘటన బాధ కలిగించింది' అని ఆడం జంపా అన్నాడు. భారత అభిమానులు క్రికెట్‌ అంటే పడి చస్తారని, అందుకే భారత్‌లో ప్రయాణించడం కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తుందని అభిప్రాయపడ్డాడు. అయితే, భారత్‌లోని మెజారిటీ క్రికెట్‌ అభిమానులు ఇలా అనుచితంగా ప్రవర్తించరని అన్నాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, ఈ ఘటనతో ఆసీస్‌ ఆటగాళ్లు ఎవరూ నిరుత్సాహ పడలేదని జంపా చెప్పాడు. బంగ్లాదేశ్‌ చిట్టగ్యాంగ్‌లో కూడా ఆసీస్‌ టీమ్‌ బస్సుపై ఇలాగే రాయి దాడి ఇటీవల పర్యటనలో చోటుచేసుకుంది. గువాహటిలో టీమ్‌ బస్సుపై రాయి దాడి తీవ్ర భయం రేకెత్తించిందని మరో ఆసీస్‌ ఆటగాడు ఆరన్‌ ఫించ్‌ ట్వీట్ చేశాడు.

మరిన్ని వార్తలు