వ్యూహంతో పాటు నైపుణ్యం, అదృష్టం కావాలి 

22 Jun, 2018 01:41 IST|Sakshi

(డీగో మారడోనా) 

బ్రెజిల్‌ తురుపుముక్క నెమార్‌ కోలుకోవడం కచ్చితంగా ఆ జట్టుకు శుభవార్తే. బుధవారం అతను ట్రెయినింగ్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. కీలకమైన తరుణంలో ఈ స్టార్‌ ఆటగాడి అవసరం ఆ జట్టుకు ఎంతో ఉంది. గ్రూప్‌ దశలో అర్జెంటీనా లాగే బ్రెజిల్‌కు రెండు క్లిష్టమైన పోటీలున్నాయి. అయితే కోస్టారికాతో శుక్రవారం జరగనున్న మ్యాచ్‌లో బ్రెజిల్‌ తప్పక గెలవాల్సిందే. ఈ ప్రపంచకప్‌ను చూస్తుంటే పెద్ద జట్లను ఎదుర్కొనేందుకు చిన్న జట్లు ఓ ఫార్ములాతో వచ్చినట్లున్నాయి. ప్రత్యర్థి జట్లలో కీలక ఆటగాళ్లను రౌండప్‌ చేయడం, సగం మైదానమంతా తమ గుంపుతో వారిని కవర్‌ చేయడం ఆకట్టుకుంది. టైటిల్‌ బరిలో లేకపోయినా కొన్ని చిన్న యూరోపియన్‌ జట్లు తమ ఉనికిని గట్టిగానే చాటుకుంటున్నాయి. యూరోపేతర జట్లలో మెక్సికో, కోస్టారికా బాగా ఆడుతున్నాయి. దీంతో బ్రెజిల్‌కు కఠిన పరీక్ష తప్పదు. గత ప్రపంచకప్‌లో క్వార్టర్‌ ఫైనలిస్ట్‌ అయిన కోస్టారికా డిఫెన్స్‌ వైఫల్యంతో తొలి మ్యాచ్‌లో ఓడింది.

కానీ ఇప్పుడైతే అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా 5–4–1 వ్యూహంతో బరిలోకి దిగి బ్రెజిల్‌ అటాకింగ్‌కు సవాల్‌ విసరొచ్చు. బ్రెజిల్‌కు తొలి మ్యాచ్‌ ‘డ్రా’ కూడా పెద్ద సమస్యగా మారింది. కోస్టారికాతో కూడా ఫలితం రాకపోతే ఇక చివరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అప్పుడు సెర్బియా (చివరి మ్యాచ్‌ ప్రత్యర్థి)తో చావోరేవో తప్పదు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురవ్వకూడదనుకుంటే బ్రెజిల్‌ శుక్రవారం కోస్టారికాపై గెలవాలి. కౌటిన్హో, నెమార్‌ ఆశించిన మేర రాణిస్తే గెలుపు ఏమంత కష్టం కాదు. ఈ నేపథ్యంలో అందివచ్చిన అవకాశాల్ని బ్రెజిల్‌ చేజార్చుకోదనే భావిస్తున్నా. పటిష్టమైన అటాకింగ్‌ దళమున్న బ్రెజిల్‌ మైదానంలో చెలరేగితే కోస్టారికా ఆత్మవిశ్వాసంపై దెబ్బ కొట్టొచ్చు. అప్పుడు ప్రత్యర్థి ఒత్తిడిలోకి కూరుకుపోతే బ్రెజిల్‌ గోల్స్‌ చేయడం సులభమవుతుంది. ఇక్కడ గోల్స్‌ చేస్తేనే సరిపోదు... డిఫెన్స్‌ కూడా దీటుగా కదలాలి. ప్రపంచకప్‌లో ముందడుగు వేయాలంటే డిఫెన్స్, మిడ్‌ఫీల్డ్‌ చురుగ్గా స్పందించాలి. బ్రెజిల్‌ 4–2–3–1 వ్యూహంతో బరిలోకి దిగితే మంచిది. ఈ వ్యూహంతో పాటు నైపుణ్యం, అదృష్టం, అంకితభావం ఆటలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. నాలుగేళ్లకు వచ్చే వరల్డ్‌కప్‌లో ప్రతీజట్టు కూడా భిన్నమైన ప్రణాళికలతో వస్తాయి.    

మరిన్ని వార్తలు