ఆదిత్య... అదుర్స్

7 Jan, 2014 02:40 IST|Sakshi
ఆదిత్య జోషి

భోపాల్: కొత్త ఏడాది భారత బ్యాడ్మింటన్‌కు శుభవార్త మోసుకొచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల ఆదిత్య జోషి ప్రపంచ జూనియర్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను అధిరోహించాడు. తద్వారా జూనియర్ పురుషుల విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ధార్ పట్టణానికి చెందిన ఆదిత్య గత నవంబరు వరకు 11వ ర్యాంక్‌లో ఉన్నాడు. అయితే ఇటీవల జరిగిన టాటా ఓపెన్ టోర్నీలో క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లోకి అడుగుపెట్టి క్వార్టర్ ఫైనల్ వరకు దూసుకొచ్చాడు. తన ఖాతాలో రెండు వేల ర్యాంకింగ్ పాయింట్లు జమచేసుకున్నాడు. ఆ తర్వాత జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ నెగ్గి తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాడు.

2001లో ఐదేళ్ల ప్రాయంలో బ్యాడ్మింటన్ రాకెట్ పట్టిన ఆదిత్య పలు స్థానిక టోర్నమెంట్లలో తనకంటే ఎక్కువ వయస్సున్న విభాగాల్లో పోటీపడి విజేతగా నిలిచి అందరిదృష్టిని ఆకర్షించాడు. ఆదిత్య ఘనతపై అతని కోచ్ అమిత్ కులకర్ణి సంతోషం వ్యక్తం చేశారు. గత ఏడాది రెండు అంతర్జాతీయ టోర్నీల్లో స్వర్ణ పతకాలు నెగ్గిన ఆదిత్య ఈ ఏడాది జరిగే యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం తేవాలని అతని తండ్రి అతుల్ జోషి ఆకాంక్షించారు. ‘ఆదిత్య బాల్యంలో కార్టూన్స్ చూస్తూ టీవీకే అతుక్కుపోకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇంట్లో కేబుల్ టీవీ కనెక్షన్ కూడా పెట్టించుకోలేదు’ అని అతని తల్లి హేమలత జోషి తెలిపింది.
 

మరిన్ని వార్తలు