‘ఫైనల్’ పటాస్!

2 Nov, 2013 01:37 IST|Sakshi
‘ఫైనల్’ పటాస్!

మధ్యాహ్నం గం. 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్షప్రసారం
 భారత క్రికెట్ అభిమానులకు నేడు రెండు పండుగలు... ఒకటి ధనాధన్ దీపావళి కాగా... రెండోది బెంగళూరులో యువ టీమిండియా మోగించనున్న పరుగుల ‘పటాస్’. ఏడు వన్డేల సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా చెరో రెండు మ్యాచ్‌లు గెలిచాయి. రెండు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఇక నేడు ఆఖరి వన్డేలో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఇప్పటికే సిరీస్‌లో రెండుసార్లు భారీ లక్ష్యాలను ఛేదించిన ధోనిసేన తుది మెట్టుపై ‘ఢామ్’ అని పేలుతుందో లేక తుస్‌మంటుందో చూడాలి.
 
 బెంగళూరు: భారీ లక్ష్యాలు సైతం భారత బ్యాటింగ్ బలం ముందు చిన్నబోతున్న వేళ... గెలవాలంటే ఎన్ని పరుగులు చేయాలో తెలియక ప్రత్యర్థి తలపట్టుకుంటున్న తరుణాన... ధోనిసేన మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో నేడు (శనివారం) జరగనున్న ‘ఫైనల్’ వన్డేలో భారత్ మరోసారి బ్యాటింగ్ ‘బాంబు’ పేల్చేందుకు రెఢీ అవుతోంది.
 
  సిరీస్ విజేతను నిర్దేశించే మ్యాచ్ కావడంతో రెండు జట్లూ నాణ్యమైన క్రికెట్ ఆడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. జైపూర్ టు నాగ్‌పూర్... బంతి తగిలితే బౌండరీ... క్రీజు వదిలితే సిక్సర్ అన్నట్లుగా విధ్వంసకాండ సృష్టించిన టీమిండియా ‘త్రిమూర్తులు’ ఈ మ్యాచ్‌పై కూడా దృష్టిసారించారు. ఓపెనింగ్‌లో రోహిత్, ధావన్‌ల శుభారంభానికి కోహ్లి మంచి ఫినిషింగ్ ఇవ్వడం భారత్‌కు కలిసొచ్చే అంశం.
 
 
 భారీ లక్ష్యాలను ఛేదించే క్రమంలో రోహిత్ ఇన్నింగ్స్ కీలకం కానుంది. ఆసీస్ పేస్‌ను ఎదుర్కోవడంలో యువరాజ్, రైనా తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. వీళ్ల స్థానంలో అంబటి రాయుడును తీసుకునే అవకాశం ఉన్నా మేనేజ్‌మెంట్ మార్పుకు అంగీకరించడం లేదు. దీంతో వీరిద్దరిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ మ్యాచ్‌లో రాణించకపోతే విండీస్‌తో వన్డే సిరీస్‌కు వీరికి జట్టులో చోటు దక్కడం కష్టమే. మిడిలార్డర్‌లో ధోని విశేషంగా రాణిస్తుండటం భారత్‌కు అదనపు బలం. అయితే ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన జడేజా ఏ విభాగంలోనూ ఆకట్టుకోలేకపోగా... లోయర్ ఆర్డర్‌లో పరుగులు రాబట్టే బ్యాట్స్‌మన్ లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. అయితే చిన్నస్వామి వికెట్ కూడా ఫ్లాట్‌గా కనబడుతోంది. కాబట్టి  టాప్ ఆర్డర్ కుదురుకుంటే భారత్‌కు ఏ సమస్యా ఉండకపోవచ్చు.
 
 
 కానీ ఈ పిచ్‌పై 350 పరుగుల లక్ష్యం కూడా చిన్నదే కావచ్చని అంచనా. అందుకే లక్ష్య ఛేదనలో లోయర్ ఆర్డర్‌లో పరుగులు చేయాల్సిన అవసరం రావొచ్చు. ఇక బౌలింగ్ విషయానికొస్తే భువనేశ్వర్, మహ్మద్ షమీ ఆరంభంలో వికెట్లు తీసినా చివర్లో పరుగులు కట్టడి చేయలేకపోతున్నారు. మిశ్రా స్థానంలో వినయ్ తుది జట్టులోకి రావొచ్చు. అశ్విన్, జడేజాలకు తోడుగా రైనా, యువరాజ్ మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేసే అవకాశం ఉన్నా... కొత్త ఫీల్డింగ్ నిబంధనల ప్రకారం వీరికి బౌలింగ్ కష్టమవుతోంది.
 
 మరోవైపు నాగ్‌పూర్‌లో భారీ స్కోరు చేసినా మ్యాచ్‌ను చేజార్చుకోవడం ఆసీస్‌ను కలవరపెడుతోంది. కేవలం ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్ ముందు ఆసీస్ బౌలర్లు తేలిపోతున్నారు. ఆఖరి మ్యాచ్‌కు జాన్సన్ అందుబాటులో లేకపోవడం పెద్ద లోటు. వాట్సన్ గాడిలో పడటం కలిసొచ్చే అంశమైతే... ఫించ్, హ్యూస్‌లు శుభారంభాన్నివ్వలేకపోతున్నారు. బెయిలీ మరో సెంచరీపై దృష్టిపెట్టగా, మాక్స్‌వెల్ నుంచి భారీ ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. బౌలింగ్‌లో నిలకడ ఉన్నా కొత్త నిబంధనల వల్ల బౌలింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాన్సన్ స్థానంలో హెన్రిక్స్ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి.
 
 జట్లు (అంచనా)
 భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రోహిత్, కోహ్లి, రైనా, యువరాజ్, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, వినయ్ / మిశ్రా.
 
 ఆస్ట్రేలియా: బెయిలీ (కెప్టెన్), హ్యూస్, ఫించ్, వాట్సన్, వోజెస్, మాక్స్‌వెల్, హాడిన్, పాల్క్‌నర్, మెక్‌కే, డోహెర్టీ, హెన్రిక్స్ /ఫెర్గుసన్.
 
 
 లక్ష్యాన్ని ఛేదించడమే బాగుంటుంది. భిన్న పరిస్థితుల్లో ఎలా ఆడాలనే దానిని బాగా విశ్లేషించుకోవచ్చు. ఆటపై అంచనాకు రావడంతో బౌలర్‌ను లక్ష్యంగా చేసుకోవచ్చు. అదే మొదట బ్యాటింగ్ చేస్తే అప్పటి పరిస్థితులనే అంచనా వేసుకోవాలి. భారీ భాగస్వామ్యాలపై దృష్టిపెట్టడం చాలా ప్రధానం.
 
  సిరీస్ సమమైనందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు సిరీస్‌ను గెలిచేందుకు మా ప్రణాళికలను సమర్థంగా అమలు చేస్తాం. మా జట్టులో ఫిట్‌నెస్ సమస్యలు లేవు. ఫైనల్ మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నాం. షార్జాలో ఆసీస్‌పై సచిన్ ఆడినట్లుగా ఆడటం నా కల.  50-60 బంతుల్లో సెంచరీ చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. కొత్త నిబంధన బౌలర్లకు శాపంగా మారింది. బ్యాటింగ్ వికెట్‌పై పరుగులు ఆపడం బౌలర్‌కు, కెప్టెన్‌కు కూడా చాలా కష్టం.    
 - కోహ్లి
 
 
 ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం వల్ల ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డాం. అందుకే మాకు మంచి రికార్డు ఉంది. ఎలా ఆడాలో మా ఆటగాళ్లకు అర్థమైంది. ఫైనల్ వన్డేలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయినా గట్టిపోటీ ఇస్తాం. యాషెస్‌ను దృష్టిలో పెట్టుకుని జాన్సన్‌ను పక్కనబెట్టారు. ఈ సిరీస్‌ను గెలిచి యాషెస్‌కు ముందు ఆత్మ విశ్వాసాన్ని కూడగట్టుకుంటాం    
 - హాడిన్
 

మరిన్ని వార్తలు