అఫ్గాన్‌ సరికొత్త చరిత్ర

18 Mar, 2019 21:32 IST|Sakshi

ఆడిన రెండో టెస్ట్‌లోనే గెలుపు

ఐర్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో విజయం

డెహ్రాడూన్‌: అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తొమ్మిది నెలల్లోనే అఫ్గానిస్థాన్‌ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆడిన రెండో టెస్ట్‌లోనే విజయం సాధించిన మూడో జట్టుగా ఖ్యాతికెక్కింది. దీంతో తాము ఆడిన రెండో మ్యాచ్‌లోనే గెలుపును అందుకొని ఈ ఘనత సాధించిన పాకిస్థాన్, ఇంగ్లండ్‌ సరసన నిలిచింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాత్రమే ఆడిన తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించి అగ్రస్థానంలో ఉంది.

ఇక ఐర్లాండ్‌తో సోమవారం ముగిసిన ఏకైన టెస్ట్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి 7 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగరవేసింది. 147 పరుగుల ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 29/1తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన అఫ్గాన్‌.. రహ్మత్‌ షా(76), ఇషానుల్లా(65 నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించడంతో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంది.

ఈ జోడీ రెండో వికెట్‌కు ఏకంగా 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. విజయానికి మరో నాలుగు పరుగులు అవసరమైన దశలో రహ్మత్, నబి(1) వరుస బంతుల్లో వెనుదిరిగినప్పటికీ ఆ తర్వాత బంతిని బౌండరీకి తరలించిన షాహిది(4నాటౌట్‌) తమ జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు. అఫ్గాన్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధసెంచరీలతో రాణించిన రహ్మత్‌ షాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్‌ 172, అఫ్గాన్‌ 314కు ఆలౌట్‌ అయ్యాయి.

రెండో ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్‌ 288 పరుగులు చేయగా, తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం వల్ల అఫ్గాన్‌ ఎదుట 147 పరుగుల సాధారణ లక్ష్యమే లభించింది. కాగా, తొమ్మిది నెలల కిందట భారత్‌తో తొలి టెస్టు మ్యాచ్‌ ఆడిన అఫ్గనిస్థాన్‌ టెస్ట్‌ క్రికెట్లోకి ప్రవేశించింది. ఆ మ్యాచ్‌లో ఓడినప్పటికీ అనంతరం వన్డే, టీ20 ఫార్మాట్లలో వేగంగా ఎదిగిన అఫ్గాన్‌ తాజా గెలుపుతో టెస్ట్‌ క్రికెట్లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా