ఆసియాకప్‌లో ఫిక్సింగ్‌ కలకలం!

25 Sep, 2018 12:05 IST|Sakshi

దుబాయ్‌: ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియాకప్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ కలకలం రేగింది. అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ జట్టు వికెట్‌ కీపర్‌ మొహ్మద్‌ షహ్‌జాద్‌ను స్పాట్‌ ఫిక్సింగ్‌ చేయమని కొంతమంది బుకీలు కలిశారు. ఈ విషయాన్ని షహజాద్‌.. టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు తెలపడంతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) యాంటీ కరెప్షన్‌ యూనిట్‌ రంగంలోకి దిగింది. వచ్చే నెల్లో షార్జాలో జరుగనున్న అఫ్గాన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఫిక్సింగ్‌ చేయాలంటూ తనను కొంతమంది కలిసినట్లు షహ్‌జాద్‌ తెలిపాడు. దీనిపై అలెక్స్‌ మార్షల్‌ నేతృత్వంలోని ఐసీసీ యాంటీ కరెప్షన్‌ యూనిట్‌ దర్యాప్తు చేపట్టింది.

‘షహజాద్‌ను ఫిక్పింగ్‌కు పాల్పడమని కొంతమంది కలిసిన ఘటన వెలుగు చూసింది. అది అఫ్గాన్‌ టీ20 లీగ్‌లో ఫిక‍్సింగ్‌ చేయాలంటూ బుకీలు ప్రేరేపించారు. కాగా, దీన్ని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా మా దృష్టికి తీసుకొచ్చారు. దర్యాప్తు చేపట్టాం. గత 12 నెలల్లో ఐదుగురు అంతర్జాతీయ స్థాయి కెప్టెన్లను బుకీలు కలిశారు. ఇందులో పూర్తిస్థాయి సభ్యత్వం కల్గిన నాలుగు దేశాలకు చెందిన కెప్టెన్లు ఉన్నారు. గతేడాది నుంచి 32 మంది ఆటగాళ్లను స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో విచారించాం. అందులో ఎనిమిది మందిపై వేటు పడింది’ అని మార్షల్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు