స్టేడియంలో గొడవ; ఛీకొట్టేలా ఫ్యాన్స్‌ ఘర్షణ

30 Jun, 2019 13:07 IST|Sakshi

లీడ్స్‌ : అఫ్గాన్‌, పాక్‌ అభిమానుల చేష్టలతో క్రికెట్‌ ప్రపంచం నివ్వెరపోయింది. ఆటను ఆస్వాదిస్తూ తమవాళ్లకు మద్దతుగా నిలవాల్సిందిపోయి.. వీధిరౌడిల్లా కొట్టుకోవడంతో ఆయా దేశాలకు తలవంపులు తెచ్చారని క్రికెట్‌ ప్రేమికులు మండిపడుతున్నారు. స్థానిక మైదానంలో శనివారం అఫ్గాన్‌, పాక్‌ల మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. అఫ్గాన్‌ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని పాక్‌ 49.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే, మ్యాచ్‌కు ముందు ఇరుదేశాల అభిమానుల మధ్య నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణం అనంతరం కూడా కొనసాగింది. 
 
మ్యాచ్‌ జరగుతున్న క్రమంలో రెండు దేశాల అభిమానులు ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో స్టేడియం బయట కూడా ఘర్షణ చెలరేగింది. అక్కడా అభిమానులు పరస్పర దాడులకు దిగారు. స్టేడియం వెలుపల ఉన్న ఆస్తులను ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గొడవకు కారణమైన వారిని బయటికి పంపించి వేశారు. వరల్డ్‌కప్‌ మిగతా మ్యాచ్‌లు చూడకుండా ఐసీసీ వారిపై నిషేదం విధించింది. ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. పాకిస్తాన్‌కు చెందిన ఓ వృద్ధ అభిమానిపై అఫ్గాన్‌ మద్దతుదారు నోరుజారడంతో ఈ గొడవ జరినట్టు తెలుస్తోంది. ఇక ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 

మరిన్ని వార్తలు