ప్రపంచకప్‌: అందరి దృష్టి వారిపైనే

1 Jun, 2019 17:48 IST|Sakshi

బ్రిస్టల్‌: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2019లో ఆసక్తికర పోరుకు రంగం సి​ద్ధమైంది. ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరుగుతున్న రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో సంచలనాల అఫ్గానిస్తాన్‌ తలపడుతోంది. బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంలో ఏడాది నిషేధం అనంతరం స్టీవ్‌ స్మిత్‌, వార్నర్‌లకు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ కావడంతో అందరి దృష్టి వారిపైనే ఉంది. స్థానిక కౌంటీ గ్రౌండ్‌ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో, టాస్‌ గెలిచిన అఫ్గాన్‌ సారథి గుల్బదిన్‌ నైబ్‌ ఏమాత్రం ఆలోచించకుండా బ్యాటింగ్‌ వైపే మొగ్గు చూపాడు.
అరంగేట్రం చేసిన గత ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్‌... స్కాట్లాండ్‌ను ఓడించి ఖాతా తెరిచింది. ఆరు మ్యాచ్‌లాడి మిగతా ఐదింటా ఓడింది. ఇప్పుడు మాత్రం తొమ్మిది మ్యాచ్‌లు ఆడేందుకు తహతహలాడుతున్న ఈ జట్టు... వీలైనన్ని మ్యాచ్‌లు గెలవాలని తహతహలాడుతోంది. ఇప్పటికే మాస్టర్‌ బ్లాస్టర్‌ అఫ్గాన్‌ సంచలనాలు నమోదు చేస్తుందని జోస్యం చెప్పాడు. దీంతో అఫ్గాన్‌ ఏ ఆగ్రశ్రేణి జట్టుకు షాకిస్తుందో వేచిచూడాలి. అఫ్గాన్‌ ప్రధాన బలం బౌలింగే. రషీద్‌, ముజీబ్‌, నబీలతో బౌలింగ్‌ దుర్బేద్యంగా ఉంది.
 
సుదీర్ఘ కాలం పాటు క్రికెట్‌ ప్రపంచాన్ని శాసించిన ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచ కప్‌ గెలిచే లక్ష్యంతో ఇంగ్లండ్‌ గడ్డపై అడుగుపెట్టింది. వార్నర్, ఫించ్‌ రూపంలో ఇద్దరు విధ్వంసకర ఓపెనర్లు జట్టులో ఉన్నారు. వీరు ఆరంభంలో చెలరేగితే ఆసీస్‌కు మంచి పునాది లభిస్తుంది. మ్యాక్స్‌వెల్, స్టొయినిస్‌ ఇదే ఊపును చివర్లో కొనసాగించగల సమర్థులు. వీరందరి మధ్య వారధిగా అసలైన వన్డే ఆటను ప్రదర్శించగల నైపుణ్యం స్టీవ్‌ స్మిత్‌ సొంతం. బౌలింగ్‌లో స్టార్క్, కమిన్స్‌ ఎలాంటి ప్రత్యర్థులనైనా కుప్పకూల్చగలరు. దీంతో నేటి మ్యాచ్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. 

తుదిజట్లు
ఆఫ్గానిస్తాన్‌: గుల్బదిన్‌ నైబ్‌ (కెప్టెన్‌), హజ్రతుల్లా, షహజద్, దౌలత్‌ జద్రాన్, రహ్మత్‌ షా, నజీబుల్లా జద్రాన్‌ హష్మతుల్లా షాహిది, హమీద్‌ హసన్, రషీద్‌ ఖాన్, ముజీబుర్‌ రహ్మాన్, మొహమ్మద్‌ నబీ.

ఆస్ట్రేలియా: ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), ఉస్మాన్‌ ఖవాజా, డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టొయినిస్‌, అలెక్స్‌ క్యారీ, కౌల్టర్‌నైల్‌, కమిన్స్‌, స్టార్క్‌, ఆడమ్‌ జంపా

మరిన్ని వార్తలు