‘ఖేల్‌రత్న’ బరిలో నీరజ్‌

4 Jun, 2020 00:26 IST|Sakshi

‘అర్జున’కు ద్యుతీచంద్‌

క్రీడా పురస్కారాల దరఖాస్తులకు గడువు పొడిగింపు

న్యూఢిల్లీ: భారత మేటి జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఈసారి కూడా ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’ బరిలో నిలిచాడు. భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) 2018 కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా క్రీడల చాంపియన్‌ అయిన నీరజ్‌ను అత్యున్నత క్రీడా పురస్కారానికి వరుగా మూడో ఏడాదీ నామినేట్‌ చేసింది. 2016లో ప్రపంచ జూనియర్‌ అథ్లెటిక్స్‌ అండర్‌–20 చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం నెగ్గిన నీరజ్‌ 2017 ఆసియా చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం దక్కించుకున్నాడు.

గత రేండేళ్లుగా నీరజ్‌ను ఏఎఫ్‌ఐ నామినేట్‌ చేస్తున్నప్పటికీ చివరకు ‘ఖేల్‌రత్న’ వరించడం లేదు. 22 ఏళ్ల నీరజ్‌కు 2018లో ‘అర్జున అవార్డు’ దక్కింది. మహిళా స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌తో పాటు ఆసియా క్రీడల స్వర్ణ విజేతలు అర్పిందర్‌ సింగ్‌ (ట్రిపుల్‌ జంప్‌), మన్‌జీత్‌ సింగ్‌ (800 మీటర్ల పరుగు), మిడిల్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ పి.యు.చిత్రలను ‘అర్జున’ అవార్డుకు సిఫారసు చేసింది. డిప్యూటీ చీఫ్‌ కోచ్‌ రాధాకృష్ణన్‌ నాయర్‌ను ‘ద్రోణాచార్య’... కుల్దీప్‌ సింగ్‌ భుల్లర్, జిన్సీ ఫిలిప్‌లను ధ్యాన్‌చంద్‌ జీవిత సాఫల్య పురస్కారం కోసం ఏఎఫ్‌ఐ ప్రతిపాదించింది.

స్వయంగా దరఖాస్తు చేసుకోండి...
ఆటగాళ్లు తమ తమ అర్హతలు, పతకాలు చరిత్రతో సొంతంగా కూడా నామినేట్‌ చేసుకోవచ్చని క్రీడాశాఖ తెలిపింది. బుధవారంతో ముగియాల్సిన నామినేషన్ల గడువును ఈ నెల 22 వరకు పొడిగించింది. కరోనా మహమ్మారి విలయతాండవం దృష్ట్యా ఈసారి క్రీడాశాఖ కేవలం ఈ–మెయిల్‌ల ద్వారానే దరఖాస్తుల్ని కోరుతోంది. నామినేషన్ల ప్రక్రియ ముగిశాక అవార్డుల కమిటీ ఎంపిక చేసే విజేతలకు ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి భవన్‌లో అవార్డుల్ని ప్రదానం చేస్తారు.

‘అవార్డులు... ఓ ప్రహసనం’: ప్రణయ్‌
భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌)పై స్టార్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ అసంతృప్తి వెళ్లగక్కాడు. ఈ ఏడాదీ తనను ‘అర్జున’కు నామినేట్‌ చేయకపోవడంపై ఈ కేరళ ప్లేయర్‌ ట్విట్టర్‌లో స్పందించాడు. ‘అవార్డుల నామినేషన్లలో పాత కథే! కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా చాంపియన్‌షిప్‌లలో పతకాలు నెగ్గిన షట్లర్‌ను విస్మరిస్తారు. దేశం తరఫున ఇలాంటి మెగా ఈవెంట్స్‌లో కనీసం పోటీపడని ఆటగాడినేమో నామినేట్‌ చేస్తారు. ‘అవార్డులు ఈ దేశంలో ఓ ప్రహసనం...’ అని ట్వీట్‌ చేశాడు.

2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణం సాధించిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న ప్రణయ్‌... అదే ఏడాది వుహాన్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌íషిప్‌లో కాంస్య పతకం సాధించాడు. ఈ ఏడాది ‘బాయ్‌’ ప్రతిపాదించిన ముగ్గురిలో సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టిలు కామన్వెల్త్‌ గేమ్స్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణం, పురుషుల డబుల్స్‌లో రజతం గెలిచారు. కానీ సమీర్‌వర్మ మాత్రం ఇప్పటి వరకు దేశం తరఫున మెగా ఈవెంట్స్‌లో బరిలోకి దిగలేదు. ప్రణయ్‌కు మద్దతుగా భారత మరో స్టార్‌ షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ వ్యాఖ్యానించాడు. ‘జాతీయ క్రీడా అవార్డుల కోసం దరఖాస్తు చేసే విధానం ఇప్పటికీ అర్థంకాదు. ఈ పద్ధతిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. ధైర్యం కోల్పోకుండా దృఢంగా ఉండు సోదరా’ అని ప్రణయ్‌కు కశ్యప్‌ మద్దతుగా నిలిచాడు.

మరిన్ని వార్తలు