స్పాట్‌ ఫిక్సింగ్‌ సమాచారం ముందే తెలుసు

5 May, 2019 01:06 IST|Sakshi

సాక్ష్యాలతో చెప్పినా కోచ్‌ వకార్‌ స్పందించలేదు

ఆఫ్రిది ఆత్మకథలో మరో సంచలన విషయం

న్యూఢిల్లీ: మొన్న అసలు వయసు దాచిన విషయం... నిన్న గంభీర్‌పై వాఖ్యలు... తాజాగా స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతం! పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిది ఆత్మకథ ‘గేమ్‌ చేంజర్‌’లో రోజుకో వివాదాస్పద అంశం బయటకు వస్తోంది. 2010 ఇంగ్లండ్‌ పర్యటన సందర్భంగా  ‘స్పాట్‌ ఫిక్సింగ్‌’కు పాల్పడి అప్పటి పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ భట్, ఆసిఫ్, ఆమిర్‌లు ఐసీసీ నిషేధానికి గురయ్యారు. అయితే ఈ స్పాట్‌ ఫిక్సింగ్‌కు సంబంధించి తనకు ముందే సమాచారం అందిందని ఆఫ్రిది తన పుస్తకంలో చెప్పుకొచ్చాడు. అదెలాగో అతడి మాటల్లోనే... ‘2010 ఆసియా కప్‌ సందర్భంగా శ్రీలంకలో ఉండగా... బుకీ మజహర్‌ మాజిద్, భట్‌ మధ్య సంభాషణ తాలూకు సందేశాలు నాకు అందాయి. మాజిద్‌ కుటుంబంతో పాటు శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు అతడి చిన్న కుమారుడు ఫోన్‌ను నీళ్లలో పడేశాడు. తర్వాత మరమ్మతు కోసం దానిని మాజిద్‌ లండన్‌లోని ఓ దుకాణంలో ఇచ్చాడు. ఆ దుకాణదారు నా స్నేహితుడికి స్నేహితుడు.

రిపేర్‌ చేస్తుండగా అతడు ఫిక్సింగ్‌కు సంబంధించిన సందేశాలు చూశాడు. వాటి గురించి నా స్నేహితుడు, మరికొందరికి చెప్పాడు. దీంతో విషయం బయటకు పొక్కింది. అప్పుడే నేను వాటిని కోచ్‌ వకార్‌కు చూపెట్టాను. అతడు దానిని ముందుకు తీసుకెళ్లలేదు. మేమిద్దరం ఏదో జరుగుతుందని భావించాం కానీ, అది ఇంత తీవ్రమైనదని అనుకోలేదు. ఆ వెంటనే జరిగిన ఇంగ్లండ్‌ పర్యటనలో మాజిద్‌ అతడి బృందం మా ఆటగాళ్లతో సన్నిహితంగా ఉండటాన్ని చూశా. దీంతో పరిస్థితిని జట్టు మేనేజర్‌ యావర్‌ సయీద్‌కు వివరించా. మాజిద్‌ను దూరం పెట్టాలని ఆటగాళ్లకు చెప్పమని కోరా. మొదట ఆయనా నమ్మలేదు. నేను మెసేజ్‌లను ప్రింట్‌ తీసుకెళ్లి చూపడంతో ‘ఇప్పుడేం చేద్దాం’ అంటూ తాపీగా అడిగారు. కానీ, అప్పటికే అందరికీ తెలిసిపోయింది’ అని వివరించాడు.  

మరిన్ని వార్తలు