30 ఏళ్ల తర్వాత ఆసీస్‌..!

6 Jan, 2019 11:14 IST|Sakshi

సిడ్నీ : భారత్‌తో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఓటమి దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకే కుప్పకూలి ఫాలోఆన్‌ను తప్పించుకోలేకపోయింది. ఇలా సొంతగడ్డపై ఆసీస్‌ ఫాలోఆన్‌ ఆడటం 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1988లో సొంత గడ్డపై చివరిసారి ఇదే సిడ్నీ  మైదానంలో ఇంగ్లండ్‌తో ఫాలో ఆన్‌ ఆడిన ఆసీస్‌.. మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఇక విదేశాల్లో 2005లో చివరగా ట్రెంట్‌ బ్రిడ్జ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాలో ఆన్‌ ఆడిన ఆసీస్‌ పరాజయం పాలైంది. 

తాజా టెస్ట్‌లో వరణుడు పదే పదే అడ్డుపడటంతో మ్యాచ్‌ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం కనబడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 300 పరుగులుకే ఆలౌట్‌ కావడంతో పర్యాటక జట్టుకు 322 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో రెండో  ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆతిథ్య జట్టు.. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. ఇంకా ఒకరోజు ఆట మిగిలి ఉంది. వరుణుడు కరుణిస్తే భారత్‌ విజయం దాదాపు ఖాయమే. ఇప్పటికే 2-1తో సిరీస్‌లో ఆధిక్యం సాధించిన కోహ్లిసేన.. ఈ మ్యాచ్‌ డ్రా అయినా సిరీస్‌ సొంతం చేసుకోనుంది. తద్వారా ఆసీస్‌ గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ నెగ్గిన భారత జట్టుగా రికార్డు సృష్టించనుంది.

మరిన్ని వార్తలు