టీ 20 మ్యాచ్: ఓ స్వీట్ రివేంజ్!

11 Sep, 2017 11:41 IST|Sakshi
టీ 20 మ్యాచ్: ఓ స్వీట్ రివేంజ్!

ఆంటిగ్వా: ఏ గేమ్లోనైనా స్లెడ్జింగ్ అనేది సర్వ సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే క్రికెట్ క్రీడలో ఆటగాళ్లు ఒకర్నొకరు కవ్వించుకోవడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒక్కోసారి  స్లెడ్జింగ్  అనేది శ్రుతి మించితే, మరొకొన్ని సందర్భాల్లో సరదాగా సరదాగా సాగుతుంది. ఇటీవల జరిగిన ఒక ట్వంటీ 20 మ్యాచ్ లో ఇద్దరు క్రికెటర్లు మధ్య జరిగిన స్లెడ్జింగ్ స్టేడియంలో ఉన్న ప్రేక్షకుల్లో నవ్వులు తెప్పించింది.
అసలేం జరిగిందంటే.. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో భాగంగా  జమైకా తల్హాస్-అమెజాన్ వారియర్స్ జట్ల మధ్య తొలుత జరిగిన మ్యాచ్ లో విలియమ్స్.. వాల్టన్ పై స్లెడ్జింగ్ కు దిగాడు. తన బౌలింగ్ లో వాల్టన్ అవుటైన క్రమంలో విలియమ్స్ చేతిలో ఏదో రాస్తూ ఇది గుర్తు పెట్టుకో అంటూ స్లెడ్జ్ చేశాడు. అయితే ఆపై ఇరు జట్లు తలపడ్డ తదుపరి మ్యాచ్ లో వాల్టన్ రెచ్చిపోయాడు. ప్రధానంగా విలియమ్స్ బౌలింగ్ నే టార్గెట్ చేసి బౌండరీల మోత మోగించాడు. మరీ ముఖ్యంగా విలియమ్స్ వేసిన ఇన్నింగ్స్ నాల్గో ఓవర్ లో  వరుస బంతుల్ని బౌండరీలు దాటించి తన బ్యాటింగ్ లో పవర్ చూపించాడు. కాగా, ఇలా బంతిని కొట్టిన ప్రతీసారి బ్యాట్పై ఏదో రాస్తూ అంతకుముందు విలియమ్స్ చేసిన దానికి స్వీట్ గా రివేంజ్ తీర్చుకున్నాడు.  ఆ మ్యాచ్ లో వాల్టన్ 40 బంతుల్లో 84 పరుగులు నమోదు చేశాడు. ఆ రెండు మ్యాచ్ లకు సంబంధించి ఆయా ఆటగాళ్ల మధ్య జరిగిన స్లెడ్జింగ్ వీడియా ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.