పాక్ మ్యాచ్తో పాటు ఐపీఎల్ కూడా..

12 Mar, 2016 12:37 IST|Sakshi
పాక్ మ్యాచ్తో పాటు ఐపీఎల్ కూడా..

ధర్మశాల: చుట్టూ పర్వతాలు, ప్రకృతి సౌందర్యం మధ్య ధర్మశాల క్రికెట్ స్టేడియం మనోహరంగా ఉంటుంది. ఏ అవాంతరాలూ ఎదురుకాకుండా ఉన్నట్టయితే ఈ వేదికలో ఈ నెల 19న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ల మ్యాచ్ జరిగేది. అయితే భద్రత కల్పించలేమని హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా మ్యాచ్ను వ్యతిరేకించడం.. ఈ పర్యవసానాల వల్ల ధర్మశాలలో తాము ఆడబోమని పాకిస్తాన్ షరతుపెట్టడంతో వేదికను కోల్కతాకు తరలించారు.

అయితే ఈ విషయంలో ధర్మశాల స్టేడియం నిర్వాహకులకు గాని, స్థానిక క్రికెట్ బోర్డుకు గానీ సంబంధం లేదు. భారత్-పాక్ మ్యాచ్ జరగాలనే కోరుకున్నారు. ఆ రాష్ట్ర రాజకీయాల కారణంగా ధర్మశాల స్టేడియం మూల్యం చెల్లించుకుంటోంది. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని ఈ స్టేడియం కోల్పోయింది. హోమ్ టీమ్ కింగ్స్ లెవెన్ పంజాబ్ తమ మ్యాచ్లను ధర్మశాల నుంచి నాగ్పూర్కు తరలించాలని బీసీసీఐని కోరింది. ఇందుకు బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఐపీఎల్ షెడ్యూల్లో ధర్మశాలను వేదికగా చేర్చలేదు. ఆటగాళ్లకు భద్రత ఏర్పాటు చేసినందుకుగాను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం భారీ మొత్తంలో చార్జీలు వసూలు చేయడం, వినోదపు పన్ను కారణంగా ఈ వేదికలో ఐపీఎల్ మ్యాచ్లు ఆడేందుకు కింగ్స్ లెవెన్ పంజాబ్ ఆసక్తి చూపడం లేదు. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం ప్రతినిధి సంజయ్ శర్మ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వం రాజకీయాలే దీనికి కారణమన్నారు.

మరిన్ని వార్తలు