అక్కడ ఆ ఇద్దరికే సాధ్యమైందీ? మరి కోహ్లికి?

7 Aug, 2018 11:45 IST|Sakshi
కెప్టెన్‌ కోహ్లి (ఫైల్‌ ఫొటో)

లార్డ్స్‌ : ఇంగ్లండ్‌తో తొలి టెస్టును తృటిలో చేజార్చుకున్న టీమిండియా రెండో టెస్ట్‌కు సిద్దమైంది. ఆగస్టు 9 నుంచి లార్డ్స్‌ వేదికగా రెండో టెస్ట్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో ఇప్పటి వరకు సారథ్య బాధ్యతలు వహించిన​ ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే విజయాలందుకున్నారు. ప్రస్తుతం విరాట్‌ కోహ్లి వంతు వచ్చింది. దీంతో లార్డ్స్‌లో కోహ్లి విజయం సాధిస్తాడా లేదా అనే విషయం చర్చనీయాంశమైంది. లార్డ్స్ మైదానంలో విజయం సాధించి ఆ ఘనత సాధించిన మూడో కెప్టెన్‌గా కోహ్లి మాజీ సారథుల సరసన నిలుస్తాడో లేదో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఈ మైదానంలో ఇప్పటి వరకు 17 టెస్టులాడిన భారత్‌ కేవలం రెండింట్లోనే విజయాలు సాధించింది. 11 పరాజయాలు నమోదు చేసుకోగా... నాలుగు టెస్టులను డ్రాగా ముగించింది. కపిల్‌ దేవ్‌, మహేంద్ర సింగ్‌ ధోని సారథ్యంలో మాత్రమే భారత్‌ ఇప్పటి వరకు లార్డ్స్‌లో విజయాలు నమోదు చేసింది. 1932లో తొలిసారి సీకే నాయుడు సారథ్యంలో భారత్‌ లార్డ్స్‌లో తొలి టెస్టు ఆడింది. ఈ టెస్టులో భారత్‌ 158 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 1986లో కపిల్‌ దేవ్ సారథ్యంలో భారత్‌ లార్డ్స్‌లో తొలి విజయాన్ని ఐదు వికెట్ల తేడాతో నమోదు చేసింది.

అనంతరం 2014లో మహేంద్ర సింగ్‌ ధోని నాయకత్వంలో భారత్‌ రెండో సారి లార్డ్స్‌లో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కుక్‌ సారథ్యంలోని ఇంగ్లండ్‌ 95 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.  భారత్‌కు ప్రపంచకప్‌ అందించిన సారథులే లార్డ్స్‌లో విజయాలు నమోదు చేయడం విశేషం. మళ్లీ ఇన్నాళ్లకు విరాట్‌ కోహ్లి నాయకత్వంలో భారత్‌ లార్డ్స్‌ మైదానంలో టెస్టు ఆడబోతోంది. గురువారం నుంచి ప్రారంభంకానున్న ఈ టెస్టులో కోహ్లి సేన విజయం సాధిస్తుందని, కోహ్లి 2019 ప్రపంచకప్‌ అందించి ధోని, కపిల్‌ సరసన చేరుతాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: పాఠాలు నేర్చుకుంటారా?

మరిన్ని వార్తలు