మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: అక్తర్‌

5 Aug, 2019 14:13 IST|Sakshi

ఇస్లామాబాద్‌: యాషెస్‌ సిరీస్‌ నుంచి  క్రికెటర్ల టెస్టు జెర్సీలపై నంబర్లు, పేర్లు తీసుకురావడంపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధానం సరికాదని, ఇది చాలా చెత్తగా ఉందని ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ ముందుగా పెదవి విప్పగా, ఇదొక పనికిమాలిన నిర్ణయం అంటూ మరో ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ బ్రెట్‌ లీ ధ్వజమెత్తాడు. ఇప్పుడు వారి వరసలో పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ చేరిపోయాడు. ఇలా టెస్టు జెర్సీలపై నంబర్లు, పేర్లు తీసుకురావడం సాంప్రదాయ టెస్టు క్రికెట్‌ను మరింత వెనక్కినెట్టమేనన్నాడు. ‘ టెస్టు జెర్సీలపై పేర్లు, నంబర్లు  కనిపించడం వికారంగా ఉంది. ఇది సరైన నిర్ణయం కాదు. సాంప్రదాయ టెస్టు క్రికెట్‌ను మరింత మసకబారుస్తున్నారు. దీన్ని వెనక్కి తీసుకోండి’ అంటూ అక్తర్‌ పేర్కొన్నాడు.

గతేడాది జరిగిన ఐసీసీ సర్వసభ్యుల సమావేశంలో టెస్టు జెర్సీలపై నంబర్లు, పేర్లకు ఆమోద ముద్ర వేశారు.దీన్ని ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ నుంచి కొనసాగించాలని అప్పుడే నిర్ణయించారు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో ఆసీస్‌-ఇంగ్లండ్‌ క్రికెటర్లు పేర్లు, నంబర్లు ముద్రించిన ఉన్న జెర్సీలతో బరిలోకి దిగారు. దీనిపై వరుసగా విమర్శలు రావడంతో ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయానికి షాక్‌ తగిలినట్లు అయ్యింది.

 

మరిన్ని వార్తలు