ఇవనోవిచ్‌కు షాక్

28 Jun, 2016 00:39 IST|Sakshi
ఇవనోవిచ్‌కు షాక్

తొలి రౌండ్‌లోనే ఓడిన మాజీ నంబర్‌వన్  వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ
 
లండన్: పూర్వ వైభవం కోసం తపిస్తున్న ప్రపంచ మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణి అనా ఇవనోవిచ్‌కు సీజన్‌లోని మూడో గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ వింబుల్డన్ కూడా కలసిరాలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లలో మూడో రౌండ్‌లో నిష్ర్కమించిన ఈ సెర్బియా బ్యూటీ వింబుల్డన్‌లో మాత్రం తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో 23వ సీడ్ ఇవనోవిచ్ 2-6, 5-7తో క్వాలిఫయర్, ప్రపంచ 223వ ర్యాంకర్ ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. గంటా 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అలెగ్జాండ్రోవా ఆరు ఏస్‌లు సంధించడంతోపాటు ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది.

అయితే తొలి సెట్‌లో, రెండో సెట్‌లో ఇవనోవిచ్ సర్వీస్‌ను రెండుసార్లు చొప్పున బ్రేక్ చేసి అలెగ్జాండ్రోవా ఫలితాన్ని శాసించింది. మరో మ్యాచ్‌లో రెండో సీడ్ ముగురుజా (స్పెయిన్) 6-2, 5-7, 6-4తో కామిల్లా జియార్జి (ఇటలీ)పై కష్టపడి గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో సీడెడ్ క్రీడాకారిణులు వీనస్ విలియమ్స్, మాడిసన్ కీస్, సమంతా స్టోసుర్, సారా ఎరాని తమ ప్రత్యర్థులపై నెగ్గి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.


జొకోవిచ్ శుభారంభం
పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో జొకోవిచ్ 6-0, 7-6 (7/3), 6-4తో జేమ్స్ వార్డ్ (బ్రిటన్)పై నెగ్గాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ నిషికోరి (జపాన్) 6-4, 6-3, 7-5తో గ్రోత్ (ఆస్ట్రేలియా)పై, ఆరో సీడ్ రావ్‌నిచ్ (కెనడా) 7-6 (7/4), 6-2, 6-4తో కరెనో బుస్టా (స్పెయిన్)పై, తొమ్మిదో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6-3, 7-5, 6-3తో బాకెర్ (అమెరికా)పై, 11వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 6-2, 6-3, 6-2తో అలెగ్జాండర్ వార్డ్ (బ్రిటన్)పై, 13వ సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 6-2, 6-1, 6-1తో డూడీ సెలా (ఇజ్రాయెల్)పై గెలిచారు.

మరిన్ని వార్తలు