ఆ బంతులు వద్దే వద్దు!

13 Oct, 2018 13:07 IST|Sakshi

హైదరాబాద్‌: టెస్టు ఫార్మాట్‌లో వాడుతున్న ఎస్‌జీ బంతులు నాణ్యత అంతంత మాత్రంగా ఉందంటూ ఇటీవల టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద‍్రన్‌ అశ్విన్‌లు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎస్‌జీ బంతుల స్థానంలో డ్యూక్‌ బంతులు కానీ, కొకాబుర్రా బంతులు కానీ వాడితే మంచిందంటూ వారు సలహా ఇచ్చారు. ఇప్పుడు వారి సరసన పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ కూడా చేరిపోయాడు. ఎస్‌జీ బంతులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని ఉమేశ్‌ యాదవ్‌ పేర్కొన్నాడు.

రెండో టెస్టు తొలి రోజు ఆట తర్వాత పోస్ట్‌ మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఉమేశ్‌.. ప్రధానంగా భారత్‌ తరహా ట్రాక్‌లపై ఎస్‌జీ బంతులు వినియోగం మంచి ఫలితాల్ని ఇవ్వడం లేదన్నాడు. మరీ ముఖ్యంగా లోయర్‌ ఆర్డర్‌ ఆటగాళ్లను ఔట్‌ చేసే క్రమంలో ఎస్‌జీ బంతులతో అంతగా ప్రయోజనం కనబడటం లేదన్నాడు. ఇక్కడ పేస్‌కు కానీ, బౌన్స్‌కు కానీ సదరు బంతులు లాభించడం లేదన్నాడు. అదే సమయంలో పిచ్‌లు స్వింగ్‌కు అనుకూలంగా ఉన్నా బంతి మెత్తబడి పోవడంతో దాన్ని రాబట్టడం కష్టతరంగా మారిందన్నాడు. దాంతో కిందిస్థాయి ఆటగాళ్లు బ్యాటింగ్‌ చేయడం మరింత సులభతరం అవుతుందన్నాడు. ఈ నేపథ్యంలో ఎస్‌జీ బంతుల వాడకాన్ని టెస్టు క్రికెట్‌లో నిలిపివేస్తేనే మంచిదన్నాడు.

మరిన్ని వార్తలు