ప్రపంచకప్‌ తర్వాత.... వన్డేలకు గేల్‌ గుడ్‌బై

18 Feb, 2019 02:10 IST|Sakshi

జమైకా: ఈ ఏడాది జరుగనున్న ప్రపంచ కప్‌ తర్వాత వన్డేలకు వీడ్కోలు పలకనున్నట్లు వెస్టిండీస్‌ విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ ప్రకటించాడు. 39 ఏళ్ల గేల్‌... 1999 సెప్టెంబరులో భారత్‌పై టొరంటోలో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించిన (2015 ప్రపంచ కప్‌లో జింబాబ్వేపై) ఏకైక వెస్టిండీస్‌ క్రికెటర్‌ గేల్‌ కావడం విశేషం. ఈ ఫార్మాట్‌లో బ్రియాన్‌ లారా (10,405) తర్వాత అత్యధిక పరుగులు చేసిన విండీస్‌ బ్యాట్స్‌మన్‌ గేలే. దాదాపు 20 ఏళ్ల కెరీర్‌ ఉన్నా... బోర్డుతో విభేదాలు, ప్రపంచ వ్యాప్తంగా లెక్కకు మిక్కిలి టి20 లీగ్‌ల్లో పాల్గొంటూ సొంత జట్టుకు తక్కువగా ప్రాతినిధ్యం వహించాడు. పొట్టి ఫార్మాట్‌లో సుడిగాలి ఇన్నింగ్స్‌లతో అందరికీ ఇష్టుడయ్యాడు. 20వ శతాబ్దంలో అరంగేట్రం చేసి ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్న ఇద్దరిలో గేల్‌ ఒకడు. మరొకరు పాకిస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ షోయబ్‌ మాలిక్‌.

మరిన్ని వార్తలు