‘పద్మశ్రీ’కి విజయన్‌ పేరు సిఫారసు

18 Jun, 2020 03:34 IST|Sakshi
ఐఎమ్‌ విజయన్‌

న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ఫుట్‌బాల్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్‌ ఐఎమ్‌ విజయన్‌ను ‘పద్మశ్రీ’ పురస్కారానికి సిఫారసు చేసింది. కేరళకు చెందిన మాజీ స్ట్రయికర్‌ 90వ దశకంలో భారత్‌ తరఫున విశేషంగా రాణించాడు. 79 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన విజయన్‌ 40 గోల్స్‌ చేశాడు. 1993, 1997, 1999లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా నిలిచాడు. 2000 నుంచి 2003 వరకు జట్టు సారథిగా వ్యవహరించాడు. 2003లో ఆయనకు అర్జున అవార్డు లభించింది.

అత్యున్నత నాలుగో పురస్కారమైన ‘పద్మశ్రీ’కి విజయన్‌ పేరును పరిశీలించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ప్రతిపాదించామని ఏఐఎఫ్‌ఎఫ్‌ కార్యదర్శి కుశాల్‌ దాస్‌ తెలిపారు. పౌర పురస్కారానికి తనను సిఫార్సు చేయడం పట్ల విజయన్‌ సంతోషం వ్యక్తం చేశాడు. మరో వైపు భారత పురుషుల హాకీ జట్టు మాజీ సహాయ కోచ్‌ రమేశ్‌ పరమేశ్వరన్‌ ద్రోణాచార్య అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది హాకీ ఇండియా (హెచ్‌ఐ) కరియప్ప, రమేశ్‌ పఠానియాలను ఆ అవార్డు కోసం నామినేట్‌ చేయగా... పరమేశ్వరన్‌ సొంతంగా హాకీ కర్ణాటక అండతో దరఖాస్తు చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు