ఫుట్‌బాల్‌ దిగ్గజం రహీమ్‌పై సినిమా 

14 Jul, 2018 01:46 IST|Sakshi

విఖ్యాత కోచ్‌ పాత్ర పోషించనున్న బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌

ముంబై: భారత ఫుట్‌బాల్‌ చరిత్రలో సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌కు విశిష్ట స్థానం ఉంది. దేశం గర్వించదగ్గ కోచ్‌గా నిలిచిన మన హైదరాబాదీ రహీమ్‌ శిక్షణలోనే భారత జట్టు 1951, 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలుచుకోవడమే కాకుండా 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌ చేరింది. ఆనాడే కొత్త తరం టెక్నిక్‌లతో మన ఆటగాళ్లను తీర్చిదిద్ది ‘రహీమ్‌ సాబ్‌’గా అందరి మన్ననలు అందుకున్న ఆయన 54 ఏళ్ల వయసులో 1963లో కన్ను మూశారు. ఇప్పుడు ఆయనపై బయోపిక్‌ రూపొందించేందుకు రంగం సిద్ధమైంది.

ఎస్‌ఏ రహీమ్‌ పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవ్‌గణ్‌ నటించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. రహీమ్‌ సాబ్‌ కోచ్‌గా వ్యవహరించిన, భారత ఫుట్‌బాల్‌కు స్వర్ణయుగంగా భావించే 1951–1962 మధ్య కాలం నేపథ్యంలో సినిమా నడుస్తుంది. అమిత్‌ శర్మ దీనికి దర్శకత్వం వహించనుండగా... జీ స్టూడియోస్, బోనీ కపూర్, ఆకాశ్‌ చావ్లా, జోయ్‌ సేన్‌గుప్తా సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ ఫుట్‌బాల్‌ పరిశోధకులు నోవీ కపాడియా దీని కోసం తగిన సమాచారం అందిస్తుండగా, సైవిన్‌ ఖాద్రస్‌–రిటేశ్‌ షా ద్వయం కలిసి సినిమా స్క్రిప్ట్‌ను రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం విడుదలవుతుంది.   

మరిన్ని వార్తలు