ప్రపంచ కప్‌ గెలిపించినా పట్టించుకోరా? 

9 May, 2018 01:12 IST|Sakshi
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భారత అంధుల క్రికెట్‌ జట్టు సారథి అజయ్‌ కుమార్‌ రెడ్డి (ఫైల్‌) 

భారత అంధుల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ అజయ్‌ ఆవేదన

మాచర్ల: అజయ్‌ కుమార్‌ రెడ్డి... ఆంధ్రప్రదేశ్‌ క్రికెటర్‌... అంతేకాదు భారత అంధుల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కూడా... రెండుసార్లు (2012లో, 2014లో) తన అద్వితీయ ప్రతిభతో భారత జట్టుకు టి20, వన్డే ప్రపంచకప్‌ టైటిల్స్‌ దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. మరో రెండుసార్లు (2017, 2018లో) కెప్టెన్‌ హోదాలో భారత జట్టును ముందుండి నడిపించి టి20, వన్డే వరల్డ్‌ కప్‌లలో విజేతగా నిలిపాడు. అయినప్పటికీ అతని విజయాలను గుర్తించే వారు కరువయ్యారు.   అంధత్వం ప్రతిభకు అడ్డుకాదని... పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించిన అజయ్‌ కుమార్‌కు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు దక్కకపోవడం గమనార్హం. నాలుగేళ్లుగా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అజయ్‌... ఆంధ్రప్రదేశ్‌లో అంధుల కోసం ప్రత్యేక క్రికెట్‌ అకాడమీని ఏర్పాటు చేయాలని సంకల్పించాడు. ఈ విషయంలో తనకు ప్రభుత్వం సహాయం చేయాలని కోరేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి కొల్లూరి రవీంద్ర ద్వారా అనేకసార్లు ప్రయత్నించాడు. కానీ మంత్రి రవీంద్ర భారత జట్టు కెప్టెన్‌ అభ్యర్థనను పట్టించుకోలేదు. జాతీయ జట్టు కెప్టెన్‌గా తనకు కనీస గౌరవం ఇవ్వకపోవడం ఎంతో బాధ కలిగించిందని ‘సాక్షి’తో అజయ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.  

అత్యంత వెనుకబడిన పల్నాటి ప్రాంతం నుంచి, అందునా పేద కుటుంబం నుంచి ఎంతో కష్టపడి పైకొచ్చి జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న తనతో పాటు అంధ క్రికెటర్లను ఆదరించకపోవడం తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని 27 ఏళ్ల అజయ్‌ అన్నాడు. ప్రభుత్వం క్రీడాకారులందరినీ ఒకేలా ఆదరించాలని... చూపు లేని క్రీడాకారులను చిన్నచూపు చూడరాదని ప్రభుత్వ క్రీడాధికారులకు విజ్ఞప్తి చేశాడు.  
నాలుగేళ్ల ప్రాయంలో తలుపు గడి తగలడంతో అజయ్‌ ఎడమ కంటి చూపును పూర్తిగా కోల్పోయాడు. కుడి కన్నుతో అతను కేవలం రెండు మీటర్ల దూరంలో ఉన్న వాటిని మాత్రమే చూడగలడు. చిన్నతనంలోనే చూపు కోల్పోయినా అతని ఆత్మవిశ్వాసం మాత్రం దెబ్బతినలేదు. తోటి వారు అంధుడు అని ఎగతాళి చేస్తుంటే అజయ్‌ అవేమీ పట్టించుకోలేదు. కేవలం తన పట్టుదలను నమ్ముకున్నాడు. నరసరావుపేటలోని అంధుల స్కూల్‌లో ప్రవేశం పొంది చదువులోనే కాదు క్రికెట్‌ ఆటలోనూ ప్రావీణ్యం సంపాదించాడు.

2006లో ఆంధ్రప్రదేశ్‌ అంధుల క్రికెట్‌ జట్టులో చోటు సంపాదించిన అతను 2010లో తొలిసారి భారత జట్టులోకి ఎంపికయ్యాడు. అదే ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో రెండు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు గెల్చుకున్నాడు. 2012లో తొలిసారి జరిగిన అంధుల టి20 ప్రపంచకప్‌లో భారత్‌కు టైటిల్‌ దక్కడంలో అజయ్‌ కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 33 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 2014లో భారత జట్టు కెప్టెన్‌గా ఎంపికైన అజయ్‌ తన నాయకత్వ పటిమతో భారత్‌కు అదే ఏడాది ఆసియా టి20 కప్‌ టైటిల్‌ను... 2017లో టి20, 2018లో వన్డే వరల్డ్‌ కప్‌ టైటిల్స్‌ను అందించాడు.  

మరిన్ని వార్తలు