విజయం ముంగిట చతికిలబడ్డారు

19 Nov, 2018 16:24 IST|Sakshi

అబుదాబి: మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్‌కు షాక్‌ తగిలింది. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్‌ విజయం ముంగిట చతికిలబడింది. కేవలం నాలుగు పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది పాకిస్తాన్‌. సోమవారం నాల్గో రోజు ఆటలో భాగంగా పాకిస్తాన్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 171 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ ఆటగాళ్లలో అజహర్‌ అలీ(75) కడవరకూ పోరాడినా జట్టును గట్టెక్కించలేకపోయాడు. అజహర్ అలీ ఆఖరి వికెట్‌గా వెనుదిరగడంతో పాకిస్తాన్‌ ఓటమి పాలైంది. ఫలితంగా పాకిస్తాన్‌ శిబిరంలో నిరాశ అలుముకోగా, కివీస్‌ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది.

ఈ రోజు ఆటలొ సాధారణ లక్ష్యంతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పాకిస్తాన్‌ 40 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఇమాముల్‌ హక్‌(27)  తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ఆపై నాలుగు పరుగుల వ్యవధిలో మహ్మద్‌ హఫీజ్‌(10) కూడా నిష్క్రమించాడు. మరో నాలుగు పరుగులు పాక్‌ బోర్డు మీద చేరిన తర్వాత హారిస్‌ సోహైల్‌(4) మూడో వికెట్‌గా పెవిలియన్‌బాట పట్టాడు. దాంతో పాకిస్తాన్‌ 48 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆ తరుణంలో అజహర్‌ అలీకి జత కలిసిన అసాద్‌ షఫీక్‌ ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టాడు. వీరిద్దరూ నాల్గో వికెట్‌కు 82 పరుగులు జత చేయడంతో పాక్‌ ఇన్నింగ్స్‌ కాస్త కుదుట పడినట్లు కనబడింది. అయితే షఫీక్‌ ఔటైన తర్వాత మళ్లీ పాక్‌ పతనం ప్రారంభమైంది. అదే సమయంలో అజహర్‌ అలీ ఒంటిరిగా పోరాడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. చేతిలో వికెట్లు లేకపోవడంతో పరుగులు తీసే అవకాశం ఉన్నా తీయకుండా తనే ఎక్కువ బ్యాటింగ్‌ చేసేందుకు ప్రయత్నించాడు. కాకపోతే అజాజ్‌ పటేల్‌ వేసిన ఓ డెలివరీకి వికెట్లు ముందు దొరికిపోయాడు అజహర్‌ అలీ. దాంతో పాక్‌ విజయం ముంగిట ఓటమి పాలైనట్లయ్యింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో అజాజ్‌ పటేల్‌ ఐదు వికెట్లతో సత్తా చాటగా, సోథీ, వాగ్నర్‌లకు తలో రెండు వికెట్లు లభించాయి.

పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌ 227 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 171 ఆలౌట్‌

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 153 ఆలౌట్‌, రెండో ఇన‍్నింగ్స్‌ 249 ఆలౌట్‌

మరిన్ని వార్తలు