విహారి, రహానే అర్ధ సెంచరీలు

20 Aug, 2019 05:54 IST|Sakshi

రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 188/5 డిక్లేర్డ్‌

విండీస్‌ ‘ఎ’తో మ్యాచ్‌ ‘డ్రా’

కూలిడ్జ్‌ (ఆంటిగ్వా): ప్రాక్టీస్‌ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన భారత వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే రెండో ఇన్నింగ్స్‌లో చక్కటి ఆటతో ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు. విండీస్‌ ‘ఎ’తో ‘డ్రా’గా ముగిసిన ఈ మూడు రోజుల మ్యాచ్‌లో రహానే (162 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్‌)కు తోడు మరో టెస్టు స్పెషలిస్ట్‌ హనుమ విహారి (125 బంతుల్లో 64; 9 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా అర్ధ సెంచరీలు సాధించారు. ఫలితంగా భారత్‌ తమ ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 188 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో మయాంక్‌ అగర్వాల్‌ (13)తో పాటు రహానే ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.

మయాంక్‌ ఔటైన తర్వాత వచ్చిన విహారితో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 96 పరుగులు జోడించారు. అయితే ఆఫ్‌స్పిన్నర్‌ అకిమ్‌ ఫ్రేజర్‌ (2/43) బౌలింగ్‌కు భారత్‌ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ముందుగా విహారి ఔట్‌ కాగా... 15 పరుగుల వ్యవధిలో రిషభ్‌ పంత్‌ (19), రవీంద్ర జడేజా (9), రహానే ఔటయ్యారు. అనంతరం సాహా (14 నాటౌట్‌), అశ్విన్‌ (10) కొద్ది సేపు క్రీజ్‌లో నిలిచాక భారత్‌ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి విండీస్‌ ‘ఎ’కు 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్‌ ‘ఎ’ 3 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసిన దశలో... ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో  ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించేందుకు అంగీకరించారు.

మరిన్ని వార్తలు